- మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి
- రామ మందిరాన్ని రాజకీయాలకు వాడుకుంటున్న మోదీ
- ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్న ప్రధాని
- దూరదర్శన్ లో రామాయణం, మహాభారతం సీరియల్స్
- కాంగ్రెస్ హయాంలోనే టెలికాస్ట్ అయ్యాయి
- రామాలయం తలుపులు తెరిపించింది రాజీవ్ గాంధీ
- ఓటు బ్యాంకు కోసం ఏనాడూ మతాన్ని అడ్డం పెట్టుకోని కాంగ్రెస్
- కాంగ్రెస్ వస్తే బుల్డోజర్ తో రామాలయాన్ని కూల్చేస్తారనడం అవివేకం
- బుల్డోజర్ చర్యలు ప్రవేశపెట్టిందే బీజేపీ
Congress senior leader jeevanreddy criticise modi issue of Ram mandir:
కాంగ్రెస్ పార్టీ మతసామరస్యానికి కట్టుబడి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. శనివారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ బతికి ఉంటే ఎప్పుడో అయోధ్యలో రామమందిరం పూర్తి అయ్యేదని, కోర్టు తీర్పు ప్రకారమే రామమందిరం నిర్మించామన్నారు. లోక్ సభ ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని హోదాలో ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన వ్యక్తి మాట్లాడే మాటలు కావని అన్నారు. కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్ తో కూల్చేస్తారని అనడం దారుణం అన్నారు. ఇది మత విశ్వాసాలను రెచ్చగొట్టడమే అని జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మోదీపై మండిపడ్డారు. ఇప్పటికైనా మోదీ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. అసలు బుల్ డోజర్ ను తెరపై తీసుకువచ్చిందే బీజేపీ అన్నారు. వాస్తవానికి రామాలయం దేవాలయం తలుపులు తెరిపించింది అప్పట్లో రాజీవ్ గాంధీయే అన్నారు. 1986 సంవత్సరంలో రాజీవ్ హయాంలో కోర్టు తీర్పును గౌరవించి హిందువుల మనోభావాలు గౌరవించే విధంగా రామ్ లల్లా గుడి తలుపులు తెరిపించారని అన్నారు. అప్పుడు మోదీ ఏమయ్యారని ప్రశ్నించారు.
1989లోనే శిలాన్యాస్
కాంగ్రెస్ సీఎం బహదూర్ సింగ్ హయాంలో 1989 సంవత్సరంలో శిలాన్యాస్ చేయడం జరిగిందన్నారు. అంతేకాదు రామాలయం గుడి శంకుస్థాపనకు అనుమతి ఇచ్చింది కూడా రాజీవ్ గాంధీయే అన్నారు. నాడు విశ్వ హిందూ పరిషత్ కూడా రాజీవ్ గాంధీ చర్యలను మెచ్చుకున్నారని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. అన్ని మతాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ ది అన్నారు. రాజీవ్ గాంధీ మళ్లీ అధికారంలోకి వస్తే రామాలయ నిర్మాణం అప్పుడే పూర్తయ్యేదన్నారు. అయితే బీజేపీ కేవలం ఎన్నికల కోసమే రామాలయం అంశాన్ని వాడుకోవడం వివాదాస్పదమయిందన్నారు. అంతేకాదు బీజేపీ మత విశ్వాసాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. అసలు దేశంలో ధార్మిక చింతన పెంపొందించింది రాజీవ్ గాంధీయే అన్నారు. రాజీవ్ హయాంలోనే దూరదర్శన్ లో రామాయణం, మహాభారతం ప్రసారాలు చేయబడ్డాయన్నారు. ఇప్పుడేమో కేవలం బీజేపీ, మోదీ వచ్చాకే రామమందిరం నిర్మాణానికి అంకురార్పణ జరిగింది అనేటట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అసలు రామాలయానికి అంకురార్పణ రాజీవ్ హయాంలోనే జరిగిందనే విషయం బీజేపీ పార్టీ గుర్తించాలన్నారు. అప్పుడు బూటా సింగ్ హోమ్ మినిస్టర్ గా ఉండేవారన్నారు. కేవలం మోదీ ఒక్కరే దేవుడిని కొలుస్తా అని చెప్పుకుంటే ఎలా అన్నారు.
ప్రజాభిప్రాయానికి గౌరవం ఇచ్చిన రాముడు
పాలనలో ప్రజాభిప్రాయానికి విలువనిచ్చింది శ్రీరాముడే అన్నారు. ఆదర్శదేవుడు శ్రీరాముడు అన్నారు. రాముడి పాలనను ఆదర్శంగా తీసుకోవాలి కానీ మత విశ్వాసాలకు, ఓటు రాజకీయాలకు వాడుకుంటున్న బీజేపీ తీరుపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. 1989లో దూరదర్శన్ లో రాజీవ్ ప్రసంగాలు వినండి. మత సామరస్యం పై రాజీవ్ మాట్లాడిన మాటలు వింటే తెలుస్తుంది అన్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ మత సామరస్యానికి కట్టుబడి ఉన్న పార్టీ అన్నారు. హిందువుల మనోభావాలను గౌరవించిన కుటుంబం గాంధీ కుటుంబమే అన్నారు. అందుకు సుబ్రమణ్యశాస్త్రి సాక్ష్యం అని..ఈ విషయం గురించి ఆయనే చెప్పారని గుర్తుచేశారు. ఎవరి రాజకీయ స్వార్థానికి తగ్గట్లుగా వారు మాట్లాడుతున్నారని..అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మూలం న్యాయస్థానం అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇవాళ మందిరా నిర్మాణం జరిగింది అంటే అది న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు వల్లే అన్నారు. ఈ సందర్భంగా మీడియా కి విజ్ఞప్తి చేస్తున్నాను. రామ మందిరం గురించి మీరు గతంలో ఉన్న రికార్డ్స్ ని తీయండి. ఎప్పుడు రామాయాలయం కి శంకుస్థాపన జరిగింది అనేది తెలుస్తుందన్నారు. సెక్యులరిజం అంటే అందరి భావాలను గౌరవించడమే అన్నారు.