- రిటైరైనా ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలలో కొనసాగుతున్న ఉద్యోగులు
- గత ప్రభుత్వానికి కోవర్టులుగా వ్యవహరిస్తున్న కొందరు ఎంప్లాయీస్
- బీఆర్ఎస్ పెద్దలకు కీలక ఫైళ్ల సమాచారం అందజేత
- ఎన్నికల కోడ్ ముగియగానే అందరినీ ఇంటికి పంపించే యోచన
- 1049 మంది రిటైర్డ్ అధికారులు పని చేస్తున్నట్లు నివేదిక
- రిటైర్డ్ బాసుల తీరుతో ఇరుకున పడుతున్న కాంగ్రెస్ సర్కార్
- నష్టనివారణ చర్యల దిశగా అడుగులు
- విద్యుత్, ఇరిగేషన్ శాఖలలోనే ఎక్కువగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు
Reventh sarkar list out job continue retired Employees:
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే తనదైన మార్కు చూపిస్తూ అన్నింటా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే పాలనలో ప్రక్షాళన తీసుకురావాలని చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రిటైర్ అయిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులను అప్పటి సీఎం కేసీఆర్ తనకు ఇస్టమైన వారిని ఇంకా ఉన్నత పదవుల్లో కొనసాగేలా జీఓ ఇచ్చేశారు. మామూలుగా అయితే రిటైర్ అయిన ఉద్యోగి కొలువులో ఉండడు. కానీ కేసీఆర్ పుణ్యమా అని కొందరు ఉన్నతాధికారులు ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. అయితే వారి ఉద్యోగాలు వారు చేసుకుంటే బాగుంటుంది. కానీ కొందరు ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి కొన్ని కీలకమైన ఫైళ్లు…అందుకు సంబంధించిన సమాచారం గత ప్రభుత్వ పెద్దలకు అందజేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ శాఖ గ్రహించింది. ఈ విషయమై రేవంత్ రెడ్డికి ఉప్పందించింది. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కార్ ఎన్నికల సందడి పూర్తవగానే సంబంధిత కోవర్టు రిటైర్డ్ ఉద్యోగులను ఇళ్లకు సాగనంపే ప్రక్రియ మొదలు పెట్టనుంది.
రిటైర్డ్ ఉద్యోగుల నివేదిక రెడీ
గతంలో పదవీ విరమణ చేసిన అధికారులు, ఉద్యోగులను బీఆర్ఎష్ ప్రభుత్వం అడ్డగోలుగా నియమించుకున్నదన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. ఇలా పదవీ విరమణ చేసిన వారిని ఉద్యోగాల్లో కొనసాగించడం ద్వారా పదోన్నతులు నిలిచిపోయాయని, అలాగే కొత్త నియామకాలు కూడా సరిగ్గా జరగలేదన్న చర్చ జరిగింది. అయితే కొత్తగా కొలువుదీరిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులను ఇంటికి పంపించే దిశగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఎంత మంది రిటైర్డ్ ఉద్యోగులు పని చేస్తున్నారో చెప్పాలన్న సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి వివిధ శాఖల కార్యదర్శలను నివేదిక ఇవ్వాలని కోరారు. సీఎస్ ఆదేశాల మేరకు అన్ని శాఖల్లో 1049 మంది రిటైర్డ్ అధికారులు పని చేస్తున్నట్లు జీఏడీకి నివేదిక అందింది. ఇలా వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించిన జీఏడీ సీఎస్‌కు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను సీఎస్ శాంతి కుమారి సీఎం రేవంత్‌రెడ్డికి రెండు నెలల క్రితమే అందజేశారు.
అన్ని డిపార్ట్ మెంటుల్లోనూ కోవర్టులు
ఒక్క పురపాలకశాఖలోనే అత్యధికంగా 179 మంది అధికారులు ఉన్నట్లు తేలింది. ఆతరువాత ఉన్నత విద్యాశాఖలో 88 మంది, పౌరసరఫరాల శాఖలో 75మంది, రోడ్లు భవనాలశాఖలో 81 మంది, సాగునీటిపారుదల శాఖ 70 మంది అధికారులు ఉన్నట్లు తెలిసింది. వీరికి జీత భత్యాల రూపంలో నెలకు రూ. 150 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 1800 కోట్ల లెక్కన గడచిన 10 ఏళ్లలో సగటున రూ.13 వేల కోట్లు చెల్లించింది. ఇలా పదవీ విరమణ చేసిన అధికారుల జీత భత్యాలతో ప్రభుత్వానికి పడిన భారం అని అంచనా .అయితే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థికంగా, ఉద్యోగపరంగా ప్రయోజనం పొందిన ఆఫీసర్లు ఇప్పటకీ ఆ పార్టీతో టచ్‌లో ఉంటున్నట్టు విమర్శలు ఉన్నాయి. సమయం, సందర్భం చూసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు కీలక ఆఫీసర్లు బీఆర్ఎస్ లీడర్లతో టచ్ లో ఉంటూ, ప్రభుత్వానికి చెందిన సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. అలాంటి అధికారులను గుర్తించి, రిపోర్టు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిఘా వర్గాలను ఆదేశించినట్టు తెలిసింది. దీనితో ప్రతి శాఖలో బీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోన్న అధికారుల వివరాలు సేకరించే పనిలో ఇంటిలిజెన్స్ నిమగ్నమైనట్టు సమాచారం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సదరు ఆఫీసర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడమో, లేక అప్రధాన్య పోస్టులకు బదిలీ చేయడమో జరుగుతుందని సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ ఉంది.
పోలీసు డిపార్టుమెంటులోనూ ఇన్ ఫార్మర్లు
విద్యుత్, ఇరిగేషన్ శాఖల్లో బీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించే ఆఫీసర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని సమాచారం.. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన కొన్ని ఘటనలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పశు గ్రాసం కోసం ఉపయోగించే కట్టర్ మిషన్‌కు ఉచిత విద్యుత్ వెసులుబాటు లేదని ట్రాన్స్ కో అధికారులు కనెక్షన్లను కట్ చేశారు. అయితే పాలనాపరమైన నిర్ణయం తీసుకోకుండానే క్షేత్ర స్థాయిలో ఎందుకు అధికారులు కరెంట్ కనెక్షన్లు కట్ చేశారని ఆరా తీయగా, ట్రాన్స్ కోకు చెందిన ఓ అధికారి ఆదేశాల మేరకు కింది స్థాయి సిబ్బంది విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారని తేలింది. వెంటనే ఆ అధికారిని అక్కడి నుంచి బదిలీ చేశారు. గత నెలలో మాజీ సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వెళ్లారు. పంటలు ఎండిపోతుంటే సాగర్ నీళ్లు విడుదల చేయలేదని ఆయన విమర్శలు చేశారు. తెల్లారే ఆ ఏరియాకు సాగర్ నుంచి నీళ్లు విడుదల చేశారు. దీంతో తన వల్లే ప్రభుత్వం నీళ్లు వదిలిందని కేసీఆర్ ప్రకటించుకున్నారు. అవసరాలను గుర్తించి, ముందుగా నీళ్లు వదలకుండా ఓ ఇరిగేషన్ అధికారి కావాలనే కేసీఆర్ టూర్ తర్వాత నీళ్లు విడుదల చేశారని ఆరోపణలు వచ్చాయి. పంజాగుట్ట పీఎస్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసులోనూ పోలీసు అధికారులు అప్పటి బీఆర్ఎస్ నేత కుమారుడిని కేసు నుంచి తప్పించే యత్నం చేశారని కొందరు అధికారులను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఎన్నికల తరువాత ఇక ఈ కోవర్టుల సంగతేంటో చూద్దామనే యోజనలో కాంగ్రెస్ సర్కారు ఉందని సమాచారం.