తెలంగాణలో జూన్ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు
స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లపై పట్టుబడుతున్న బీసీలు
ఏ రాష్ట్రంలోనైనా 50 శాతం రిజర్వేష్లు మించకూడదని సుప్రీం ఆదేశం
50 శాతం రిజర్వేషన్ లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు
23 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ నిర్ణయాన్ని తప్పుబట్టిన రాష్ట్ర హైకోర్టు
కులగణన అంశం తీసుకుంటే ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం
తమకు సీటు వస్తందో లేదో అని సీఎం పై ఒత్తిడి తెస్తున్న బీసీ నేతలు
congress sarkar deside to conduct local body elections bc reservations:
జూన్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని అనుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ కు పొలిటికల్ రిజర్వేషన్ల సెగ తగిలింది. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తారో అనే చర్చ మొదలయింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఓవరాల్ గా అన్ని కులాలకు కలిపి 50 శాతం రిజర్వేషన్ కు మించకూడదని ఆదేశం. ఈ 50 శాతం పరిధిలోనే ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ద విధానంలో దామాషా ప్రకారం కల్పించాల్సివుంది. మిగిలిన శాతాన్ని మాత్రమే బీసీ వర్గాలకు కేటాయించాల్సి ఉంది. దీనితో బీసీలు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. తమకు తక్కువ శాతం దక్కుతోందన్న భావనలో బీసీ వర్గాలు ఉన్నాయి. దశాబ్దాలుగా బీసీలు తమకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఈ సారి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. జనాభా లెక్కల ప్రకారమా లేక కులగణన చేపట్టి రిజర్వేషన్ ఇవ్వాలా అనే అంశాన్ని సీరియస్ గా ఆలోచిస్తోంది రాష్ట్ర సర్కార్.
లోకల్ ఎన్నికలకు ముందే రిజర్వేషన్లు ఓ కొలిక్కి
జూన్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే అంతకు ముందే బీసీ రిజర్వేషన్లు ఓ కొలిక్కి రావాలి. ఇప్పటిదాకా లోకల్ బాడీ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక ప్రకారమే రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. బీసీల రిజర్వేషన్లు మాత్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అమలు చేస్తున్నారు. అది కూడా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి 50 శాతం మించకుండానే బీసీలకు సీట్లు కేటాయిస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ బీసీల రిజర్వేషన్ ను 23 శాతానికి తగ్గించి ఎన్నికలు జరిపించింది అప్పట్లో ఈ చర్యను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. రిజర్వేషన్లను తగ్గించి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. అంతేకాకుండా రిజర్వేషన్లను పాటించని ఎన్నికలను ఎందుకు రద్దు చేయకూడదని కూడా ప్రశ్నించింది. దీంతో.. 2024లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీం మార్గదర్శకాలను అమలుచేస్తామని కోర్టుకు ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది.
రాజ్యాంగ సవరణకు అమోదిస్తేనే..
రిజర్వేషన్ల పెంపు అంశం రాష్ట్రాల పరిధిలో లేదు. ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లను కులాల వారీగా పెంచాలంటే భారత ప్రభుత్వం రాజ్యాంగంలో సవరణలు చేయాల్సి ఉంది. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు పెట్టి.. దానిని ఆమోదిస్తేనే రిజర్వేషన్ల పెంపునకు అవకాశం ఉంటుంది. కానీ, దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయాల్సి ఉంటేనే కేంద్రం అందుకు అంగీకరిస్తుంది. కాగా, ఒడిసా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించి స్థానిక ఎన్నికలను నిర్వహించింది. ఒకవేళ దాని ప్రకారం తెలంగాణలోనూ ఎన్నిక నిర్వహించేందుకు అవకాశం ఉన్నా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో బీసీల రిజర్వేషన్లను తేల్చండా ఎన్నికలు నిర్వహించడం కాంగ్రె్‌సకు ఇబ్బందిగా మారుతుంది.
ఆశావహుల్లో గుబులు
స్థానిక సమరంలో రిజర్వేషన్ల వేడి రోజురోజుకు పెరుగుతుండగా.. తమకు పోటీ చేసే అవకాశం వస్తుందో, రాదోనని ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల సమయంలో రిజర్వేషన్‌లో మార్పులు జరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ప్రతిసారీ ఎవరో ఒకరికి అవకాశం వస్తోంది. కానీ, ఈసారి బీసీలకు రిజర్వేషన్ అంశం తేలకపోవడంతో.. క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల కోసం పనిచేసిన వారికి సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పోటీచేసేందుకు అవకాశం వస్తుందో లేదోననే చర్చ జరుగుతోంది.