Congress Releases Election Manifesto Nyay Patra for Lok Sabha 2024: దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం మొదలవుతోంది. ఏడు విడతలుగా జరగనున్న ఈ లోక్‌సభ ఎన్నికలలో ఈనెల 19న మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ‘పంచ న్యాయ’ పేరుతో తన ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 5న విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో పాటు సీనియర్ నేతలు విడుదల చేసిన ఈ మేనిఫెస్టోను సరిగ్గా ఒక్కరోజు తర్వాత తెలంగాణలోని తుక్కుగూడలో జనజాతర సభలో తెలుగులోనూ రాహుల్ గాంధీ విడుదల చేశారు.
లక్షలాది ప్రజలు పాల్గొన్న జన జాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ మేనిఫెస్టో కేవలం కాంగ్రెస్ ఇచ్చే వాగ్దానాల పత్రం మాత్రమే కాదనీ, ఇది దేశ ప్రజల గుండెఘోష అని అభివర్ణించారు. తన పాదయాత్రలో ప్రజలు తనతో వెళ్లబోసుకున్న గోడును దూరం చేసేందుకే ఆయా వర్గాల ప్రజలకు సంబంధించిన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచామని రాహుల్ వివరించారు. యువత, మహిళ, రైతు, శ్రామిక వర్గాలతో బాటు అభివృద్ధిలో అన్ని వర్గాలకూ ప్రాతినిథ్యం అనే ఐదు కేటగిరీల్లో మొత్తం 25 కీలక హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చింది.
Also Read:కాంగ్రెస్ పార్టీ పంచతంత్రం, విజయమంత్రం
మొదటగా సామాజిక న్యాయాన్ని తీసుకుంటే దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామని, రిజర్వేషన్ల శాతాన్ని 50% మించి పెంచుతామని ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పిస్తామని, జల్ జంగల్ జమీన్ నినాదాన్ని వినిపించే ఆదివాసీలకు పోడు భూమి పట్టాలు ఇస్తామని, ‘మనభూమి మన పాలన’ పేరుతో గిరిజన, ఆదివాసీలు నివసించే ప్రాంతాలకు గుర్తింపు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఇక రెండవదైన.. యువ న్యాయం అంశంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల అంశాలను పొందుపరచింది. ఏడాదికి లక్ష మంది నిరుద్యోగులకు అప్రెంటిషిప్ శిక్షణ పేరు మీద నెలకు రూ. 8500 చొప్పున ఏడాదికి రూ. లక్ష అందిస్తామనే వాగ్దానం, యువతకు ప్రశ్నాపత్రాల లీకేజీ నుంచి విముక్తి, ప్రభుత్వ ఉద్యోగాలకు ఫీజు రద్దు, వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే యువతీయువకుల కోసం రూ. 500 కోట్ల ప్రత్యేక స్టార్టప్ నిధి వాగ్దానాలు యువతను ఖచ్చితంగా ఆకర్షించేవే.
ఇక మూడవదైన రైతు న్యాయం విషయానికొస్తే బిజెపి ఏ విషయంలోనైతే బలహీనంగా ఉందో ఆ విషయాన్ని పట్టుకొని ముందుకు వెళదామని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉదాహరణకు పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామనే మాటతో బాటు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా మద్దతు ధర నిర్ణయిస్తామని హామీ ఇచ్చింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మోసగించిన బిజెపికి భిన్నంగా తాము రైతుకు మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చింది. అలాగే, యూపీఏ హయాంలో దేశ వ్యాప్తంగా రూ. 71 వేల కోట్ల రైతు రుణమాఫీ మాదిరిగా మరోసారి రైతులకు రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. బీజేపీ సర్కారు కార్పొరేట్లకు 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయగా లేనిది రైతులకు రుణమాఫీ చేస్తే తప్పేముందని కాంగ్రెస్ గట్టిగా చెబుతోంది. రైతుల పంటకు బీమా చెల్లింపుల ప్రత్యక్ష బదిలీ చాలా మంచి పథకం. ‘ప్రకృతి శాపం కాదు పాలకుల పాపం’ వల్లనే రైతులు నష్టపోతున్న విషయాన్ని గుర్తించి రైతులు వాడే యంత్రాలు, పనిముట్ల మీద జీఎస్టీ ఎత్తివేయటం ఆహ్వానించాల్సిన పరిణామాలు. రైతన్నకు ఈ పథకాలు భరోసా ఇస్తాయా అనేది ఒక ప్రశ్న అయితే.. ఎక్కడో ఒకచోట సంస్కరణలు మొదలు పెట్టాల్సిందే.
Also Read:పరాకాష్టకు చేరిన పన్ను తీవ్రవాదం..!
నాల్గవదైన మహిళా న్యాయానికి వస్తే.. కర్ణాటకలో మాదిరిగా దేశమంతా పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష సాయం అందిస్తామని మేనిఫెస్టో హామీ ఇచ్చింది. దీనితో బాటు ఉద్యోగాల్లో సగం వాటా, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు ,ఆయాలు వీరందరికీ ఇచ్చే జీతాల కేంద్ర ప్రభుత్వ వాటా రెట్టింపు చేస్తామని ప్రకటించింది. మహిళా సమస్యల పరిష్కారానికి మహిళలు.. తమకు అందే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తమకున్న చట్టపరమైన హక్కులు తెలుసుకోవడానికి గ్రామాల వారీగా మైత్రీ కమిటీలు వేస్తామనే హామీతో బాటు భారత తొలి మహిళా టీచర్, సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే పేరు మీద వర్కింగ్ మహిళలకు దేశవ్యాప్తంగా మహిళ హాస్టల్స్ సంఖ్య రెట్టింపు చేస్తామన్న హామీ కూడా ఆహ్వానించ దగినదే. చివరిదైన కార్మిక న్యాయ విషయంలో పని ప్రదేశంలో ఆరోగ్యకరమైన పరిస్థితిని కల్పిస్తామనే వాగ్దానం, జాతీయ ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు, పట్టణ కార్మికులకు రోజుకు రూ. 400 రోజువారీ వేతన భరోసా మంచి ఆలోచన. ప్రస్తుత గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంత కార్మికులకు కల్పించడం హామీ ఇంకా బాగుంది. అలాగే సామాజిక భద్రత కింద అసంఘటిత కార్మికులకు ప్రమాద బీమా హామీ, ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు టెంపరరీ ఉద్యోగాల వ్యవస్థ రద్దుచేసి ఒకే పనికి ఒకే వేతనం అనే అంశాన్ని జత చేయడం ఇంకా మంచిది.
ఇవి కాకుండా రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లో ఉన్న పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని సవరిస్తామని, తద్వారా ఒకపార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలోకి జంప్ చేస్తున్న వారి ఆటకట్టిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించినట్లుగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు వంటి ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండానే పార్టీలోకి చేర్చుకోవటం నైతికంగా సరైన నిర్ణయం కాబోదు. దీనివల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పలు విమర్శలను ఎదుర్కోవాల్సి రావటమే గాక తానూ ఈ అనైతిక పద్ధతికి బలికావాల్సి కూడా రావచ్చు. మొత్తంగా చూసినప్పుడు ఈ హామీలన్నీ ఆచరణ సాధ్యంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఏ మేరకు అధికారంలోకి రాగలుగుతుందనే అనుమానాలు జనంలో ఉన్నాయి. ఏది ఏమైనా కేంద్ర పాలకుల నియంతృత్వ పోకడలను నిలదీస్తూ, వారు సృష్టించిన సమస్యలకు పరిష్కారాలను తమ మేనిఫెస్టో రూపంలో కాంగ్రెస్ చేసిన ప్రయత్నం మాత్రం అభినందించదగినదే. అయితే, ఈ ఎన్నికల తంత్రంలో కాంగ్రెస్ పంచతంత్రం ఏమేరకు ఉపయోగపడనుందో తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు మనం వేచి చూడాల్సిందే.
–బండారు రామ్మోహన రావు (పొలిటికల్ అనలిస్ట్)