Congress Party Fire on BRS Party Leaders : తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో సోమవారం తొలిసారిగా యాదాద్రికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ సహా పలువురు ఉన్నారు. అయితే, పూజల సమయంలో రేవంత్‌తో పాటు కోమటిరెడ్డి, ఉత్తమ్ పెద్దపీటలపై, పక్కనే భట్టి విక్రమార్క, కొండా సురేఖ చిన్న పీటలపై కూర్చొని కనిపించారు. దీంతో బీఆర్ఎస్ మనోభావాలు దెబ్బతిన్నాయి. అదేంటి, అయితేగియితే భట్టి, కొండా ఫ్యాన్స్ ఫీలవ్వాలి గానీ, గులాబీ నాయకులు అంతలా ఫీలవ్వడం ఎందుకు? అనే ప్రశ్న తెరపైకొచ్చింది. అయినా, కూడా చేయాల్సిన రాద్ధాంతం చేసేశారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శల దాడి కొనసాగించారు. కొందరు నేతలు మీడియా ముందుకొచ్చి దళితులు, బీసీలకు అవమానం జరిగిందంటూ తమ స్టయిల్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌ను వినిపించారు. దీనికి కాంగ్రెస్ సైడ్ నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది. తమ పార్టీలో కుల విభేదాలు ఉండవని, అంతా సమానమేనని కొన్ని ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసింది. అయినా, బీఆర్ఎస్ నేతలు ఆగలేదు. ఆగకుండా విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో భట్టి విక్రమార్కే రంగంలోకి దిగారు.
Read More : 15 కోట్లతో పరార్ అయిన ప్రభుత్వ ఉద్యోగి
బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని, తాను కావాలనే చిన్న పీటపై కూర్చున్నానని తెలిపారు. దేవునిపై భక్తితోనే అలా చేశానని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు మొక్కు చెల్లించానన్న ఆయన, తనను ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు. తన ఫోటోను కావాలనే ట్రోల్ చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. డిప్యూటీ సీఎం హోదాలో తాను రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే రకం కాదని తెలిపారు. ఎవరికీ తల వంచనని, ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదన్నారు భట్టి విక్రమార్క.
ఇటు, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై సీనియర్ నేత మల్లు రవి కూడా స్పందించారు. గులాబీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. దళితులను గౌరవించడంపై బీఆర్ఎస్ నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ పాలనలో దళితులకు ఎన్ని అవమానాలు జరిగాయో అందరికీ తెలుసన్న ఆయన, సానుభూతి కోసమే డ్రామాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై ఫైరయ్యారు. మొత్తానికి భట్టి క్లారిటీతో ఈ వివాదం సద్దుమణిగింది.