– 5 రంగాలు.. పాతిక హామీలు
– ‘న్యాయపత్ర’ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో
– సామాజిక న్యాయమే ఎజెండా
– రైతు, మహిళ, యువత, కార్మికులకు హామీలు
– ఉపాధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
– పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పథకాలు
– 14 భాషల్లో.. 8 కోట్ల కుటుంబాలకు మేనిఫెస్టో
– విడుదల చేసిన సోనియా, ఖర్గే
Congress Party Announced The National Manifesto: సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తన జాతీయ మేనిఫెస్టోను ప్రకటించింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు విడుదల హస్తినలో ‘న్యాయపత్ర’ పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో యువన్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్ పేరుతో యువత, మహిళ, రైతు, కార్మిక వర్గాలతో బాటు సామాజిక న్యాయం అందించేందుకు పలు కీలక హామీలిచ్చారు. గత పదేళ్లలో దేశంలో అనేక రంగాల్లో తీవ్ర విధ్వంసం జరిగిందనీ, తాము అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా నేతలు హామీ ఇచ్చారు.
మేనిఫెస్టో విడుదల సందర్భంగా దీనిని పేదలకు అంకితమిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజలకిచ్చిన హామీలకు మేనిఫెస్టోలో స్థానం కల్పించినట్లు తెలిపారు. ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు దేశవ్యాప్తంగా జనగణన చేపట్టి ఆయా వర్గాల స్థితిగతులను వాస్తవిక కోణంలో అంచనావేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రైతు, మహిళ, యువత, కార్మికులు, సామాజక న్యాయం అనే ఐదు ప్రధాన అంశాల ఆధారంగా రూపొందిన ఈ మేనిఫెస్టో వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్రను లిఖించబోతోందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల మోదీ పాలనలో దేశంలో ఒక్క ఫ్యాక్టరీ నిర్మాణం కాలేదనీ, ఇదేంటని నిలదీసిన నేతలను జైళ్లపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమాన అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీపై రూ.3,500 కోట్ల జరిమానాలు వేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రజలంతా ఏకమై పోరాడి మోదీని గద్దె దించేందుకు కలిసిరావాలి. పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఈ మేనిఫెస్టోను ప్రజలకు చేరువ చేయాలని పిలుపునిచ్చారు.
Also Read: ప్రతిపక్ష కూటమిలో పీఎం క్యాండిడేట్ ఎవరు? రాహుల్ గాంధీ సమాధానం ఇదే
వర్కింగ్ కమిటీలో పూర్తిస్థాయిలో చర్చించి మేనిఫెస్టోను తయారు చేసినట్లు పార్టీ నేత, దీని కమిటీ ఛైర్మన్ పి.చిదంబరం తెలిపారు. యూపీఏ తొలి విడత పాలనలో 8.5 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. గత పదేళ్లలో దేశం 5.9 శాతం మాత్రమే వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం 24 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చిందని.. 2024లో అధికారం చేపట్టాక మరో 23 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పిస్తామని చిదంబరం పేర్కొన్నారు. కీలకమైన ఐదు భాగాల్లో 25 కీలక హామీలతో కూడిన 48 పేజీల మేనిఫెస్టోను 14 భాషల్లో ప్రచురించి, 8 కోట్ల కుటుంబాలకు చేర్చనున్నట్లు చిదంబరం వెల్లడించారు.
రైతుకు భరోసా
పంటలకు కనీస మద్దతు ధరకు కమిషన్
దేశవ్యాప్తంగా రైతురుణమాఫీ
వ్యవసాయ పరికరాల మీద జీఎస్టీ రద్దు
మహిళా సంక్షేమం
ప్రతి పేద మహిళకూ ఏటా రూ. లక్ష (మహాలక్ష్మి పథకం)
కేంద్ర ఉద్యోగాల్లో సగం మహిళలకే
ఆశ, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతన పెంపు
యువతే లక్ష్యం
ప్రతి డిప్లొమా హోల్డర్‌కు ప్రభుత్వ రంగ లేదా ప్రైవేట్ రంగ సంస్థలో ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్
అప్రెంటిస్‌షిప్‌లో ఉన్న పాతికేళ్లలోపు యువతకు ఏడాదికి లక్ష ఆర్థిక సాయం
ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజుల రద్దు
మార్చి 15 నాటికి గల విద్యారుణాల మాఫీ
కాంట్రాక్ట్ ఉద్యోగాల రెగ్యులరైజేషన్
అగ్నిపథ్ పథకం రద్దు
అందరికీ ఆరోగ్యం
అందరికీ రూ.25 లక్షల ఉచిత వైద్య సదుపాయం
టీకాల పంపిణీకి ప్రత్యేక మిషన్, ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచిత టీకాలు
సామాజిక న్యాయం
రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితి ఎత్తివేత
అన్నికులాలకూ ఈడబ్యూఎస్ అమలు
ఎస్సీ, ఎస్టీల గృహరుణాల పెంపు
రూ.1000 కేంద్ర సామాజిక పెన్షన్
వృద్ధులకు బస్సు, రైళ్లలో ప్రయాణ రాయితీ
బ్రెయిలీని ప్రత్యేక భాషగా గుర్తింపు
మిగులు భూమి గుర్తింపు,
దళిత కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనుల్లో ప్రాధాన్యం
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూళ్లు, స్కాలర్‌షిప్ పెంపు
మైనారిటీల మతహక్కులకు రక్షణ, సమర్థన
మైనారిటీ యువతకు విదేశీ విద్య, ఉపాధికి రుణాలు
మరిన్ని భాషలకు రాజ్యాంగ గుర్తింపు
దేశవ్యాప్తంగా కులగణన
ఇతర కీలక హామీలు
రాష్ట్రాలకు దామాషా ప్రకారం నిధులు,
‘రక్షా న్యాయ్’ కింద విదేశీ వ్యవహారాల్లో మార్పులు
జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా,
తప్పుడు వార్తల నియంత్రణకు 1978 నాటి ప్రెస్ కౌన్సిల్ ఇండియా చట్టాన్ని సవరిస్తాం