congress new plan on lok sabha elections : త్వరలో పార్లమెంట్ ఎన్నికల యుద్ధం జరగనుంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఏడు విడతల్లో జరగనున్న ఎన్నికల్లో మొదటి దశకు నోటిఫికేషన్ కూడా రిలీజైంది. తెలంగాణలో మే 13న 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మూడోసారి జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలలో గెలుపుని మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మెజార్టీ లోక్ సభ స్థానాలలో జయకేతనం ఎగురవేయాలని భావిస్తోంది. 2014 లోక్ సభ ఎన్నికలలో రెండు లోక్ సభ స్థానాలు 2019 లోక్ సభ ఎన్నికలలో మూడు లోక్ సభ స్థానాలు గెలిచిన కాంగ్రెస్, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన స్ఫూర్తితో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలోనూ సత్తా చాటి 12 నుండి 14 సీట్లలో గెలిచి తన విజయ పరంపరని కొనసాగించాలని వ్యూహాలకు పదునుపెడుతోంది.
గత రెండు శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేలవమైన ఫలితాలను సాధించింది. కానీ, మారిన రాజకీయ పరిస్థితులలో రాష్ట్రంలో కాంగ్రెస్ మిగతా పార్టీల కంటే బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా కాంగ్రెస్ బలం పెరిగింది. దీనికితోడు రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతం కావడం, ఎన్నికల సందర్భంగా సునీల్ కనుగోలు వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన వలసలు, నాయకులు సమిష్టిగా కలిసికట్టుగా పనిచేయటంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో విజయం సాధించింది బీఆర్ఎస్ పాలన కొనసాగిన దశాబ్ద కాలంలో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్దఎత్తున బీఆర్ఎస్‌లో చేరారు. రెండు పర్యాయాలు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ బీఆర్ఎస్‌లో విలీనమైంది. అయినా, కాంగ్రెస్ పార్టీ మళ్లీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలోపేతం కావటమే కాదు, శాసనసభ ఎన్నికలలో జయకేతనం ఎగురవేసింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఎదగుటమే కాదు రెండు మూడు లోక్ సభ స్థానాల ప్రాతినిధ్యం నుండి ఏకంగా మెజార్టీ లోక్ సభ స్థానాలను గెలుచుకునే స్థాయికి ఎదిగిందనే చెప్పాలి.
ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో 64 శాసనసభ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన వంద రోజుల పరిపాలనలోనే శాసనసభ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయటానికి చిత్తశుద్దితో ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయం ప్రజలలో కల్పించగలిగింది. అధికారంలోకొచ్చిన 48 గంటలలోనే అమలులోకి తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంచడంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్స్ కంటే తక్కువ విద్యుత్ వినియోగించే గృహాలకు జీరో బిల్లులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయల లాంటి గ్యారెంటీలు అమలులోకి తేవడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 6 గ్యారెంటీల హామీ శాసనసభ ఎన్నికలలో గెలిపించిన విధంగానే వాటి అమలు లోక్ సభ ఎన్నికలలో పార్టీని గెలిపించబోతున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి మాసంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 53 వేల కోట్ల రూపాయలను కేటాయించి ఒక్కొక్క గ్యారెంటీని అమలులోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల ప్రజలలో సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లుగానే కనిపిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 500కే గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్ లాంటి గ్యారెంటీల పట్ల ప్రజలు ముఖ్యంగా మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాబోయే లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ ఓటుతో మెజార్టీ లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనలో గ్యారెంటీల అమలుతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం చేస్తున్న ప్రయత్నాలు గ్రూప్ వన్, ఉపాధ్యాయ నియామకాల కోసం నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు నేర్పటం ద్వారా నిధులను, ప్రాజెక్టులను రాబట్టటం మంత్రులు, ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండటం కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో కలిసి వచ్చే అంశాలే కాబట్టి రాబోయే లోక్ సభ ఎన్నికలలో తన బలాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐదు గ్యారెంటీలతో కర్ణాటక శాసనసభ ఎన్నికలలో విజయం సాధించింది కాంగ్రెస్. అలాగే, ఆరు గ్యారెంటీలతో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలుపొందింది. అదే స్ఫూర్తితో భాగిదారీ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక న్యాయ్, కిసాన్ న్యాయ్, యువ న్యాయ్ లాంటి పంచ న్యాయ్‌లతో 18వ లోక్ సభ ఎన్నికలను ఎదుర్కోబోతోంది కాంగ్రెస్ పార్టీ హామీగా ఇస్తున్న ఈ న్యాయ్‌లు కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు విజయ తీరాలకు చేరుస్తుందో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
డాక్టర్ తిరునాహరి శేషు
అసిస్టెంట్ ప్రొఫెసర్
కాకతీయ విశ్వవిద్యాలయం
9885465877