KCR: మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలో టాల్ లీడర్ కేసీఆర్ కాకుండా ఇంకెవరు ఉన్నారు? అనే ప్రశ్న వేసిన ఆ పార్టీ ఇప్పుడు ఉనికిని కాపాడుకునే స్థితికి జారుకుంది. ఒకరి వెనుక మరొకరు అన్నట్టు ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. పార్టీని వీడవద్దని, భవిష్యత్‌లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నా ఎమ్మెల్యేలు ఆగని పరిస్థితి. ఈ తరుణంలో కేసీఆర్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధికార పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, 20 మందిని వెంట తీసుకుని వస్తానని తనకు చెప్పారని కేసీఆర్ అన్నారు. కానీ, తానే వారించినట్టు చెప్పారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి స్థిరత్వం లేదని, టీమ్ వర్క్ లేదనీ ఆరోపించారు.ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలు జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు హస్తం గూటికి చేరుకున్నారు. తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలోనే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. మరుసటి రోజున తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఇద్దరు ఎవరు? అనే ఆసక్తి కూడా ఉన్నది. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఏకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే వెల్లడించడం కూడా వాస్తవ పరిస్థితులను వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా కేసీఆర్ మాత్రం ఇందుకు భిన్నంగా కామెంట్ చేశారు.
వాస్తవానికి కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌లు విస్తృత స్థాయి సమావేశానికి హాజరుకాలేదు. దీంతో వీరిద్దరూ పార్టీ మారుతున్నారా? కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? అనే చర్చ మొదలైంది.
తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయికిరణ్ యాదవ్‌కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తున్నట్టు మొదట్లో కొంత ప్రచారం జరిగింది. అందుకు గులాబీ బాస్ కూడా సుముఖంగానే ఉన్నారనే టాక్ వచ్చింది. కానీ, చర్చ అంతటితోనే ముగిసిపోయింది. టికెట్ ఎందుకు ఇవ్వలేదనేది సస్పెన్స్‌గానే ఉండిపోయింది. కేసీఆర్ ఇవ్వలేమని చెప్పారా? తలసానినే వద్దనుకున్నారా? అనేది తెలియదు. మొత్తానికి గత కొన్ని రోజులుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇక ప్రకాశ్ గౌడ్ కూడా త్వరలోనే కాంగ్రెస్‌లోకి వెళ్లుతున్నట్టు చర్చ జరుగుతున్నది. ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంతో ఈ ప్రచారం జరుగుతున్నది. జూబ్లిహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయన గతంలో ఒకసారి కలిశారు. ప్రకాశ్ గౌడ్‌కు అక్కడ సాదర స్వాగతం లభించింది. దీంతో అప్పుడే ఆయన పార్టీ మారుతున్నట్టు కథనాలు వచ్చాయి. వాటిని ఆయన ఖండించారు. ఇప్పుడు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి గైర్హాజరు కావడంతో మరోసారి ఈ ప్రచారం మొదలైంది. ఒక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుండగా కేసీఆర్ మాత్రం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తనతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించడం వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.