– ఓవైపు కవిత అరెస్ట్
– ఇంకోవైపు నేతల వలసలు
– వెంటాడుతున్న ఫోన్ ట్యాపింగ్
– షాకులిస్తున్న సర్వేలు
– ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరిందా?
– సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యల వెనుక అర్థమేంటి?
Congress leaders fire on KTR(Telangana politics) : ప్రతిపక్షం అంటే హుందాగా ఉండాలి. ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తిచూపాలి, అవసరమైతే సలహాలు ఇవ్వాలి. అదే పనిగా బురద జల్లే ప్రయత్నం చేస్తే అసలుకే ఎసరు తప్పదు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి పార్టీలు. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాల్లో ఉన్నారు నేతలు. అయితే, మాజీ మంత్రి కేటీఆర్ తీరు మాత్రం చర్చనీయాంశంగా మారింది.
ఈమధ్య ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లిన ఆయన అదే పంథాను కొనసాగించారు. కాంగ్రెస్ ఓ విష సర్పం అంటూ రెచ్చిపోయారు. కేసుల భయంతో సీఎం త్వరలోనే బీజేపీలో చేరతారని జోస్యం చెప్పారు. అంతేకాదు, ఆయనతోపాటు 25-30 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోతారని అన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత ఇది జరుగుతుందని చెప్పారు.
కేటీఆర్ వ్యాఖ్యలు విన్న కాంగ్రెస్ నేతలు ఈ ఏడాది ఇదే అతిపెద్ద జోక్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంతకుముందు కూడా రాహుల్ గాంధీకి ఎన్నికల ఖర్చు కోసం రూ.2,500 కోట్లు పంపండం కోసం బిల్డర్లు, రియల్టర్లను సీఎం బెదిరించి ఆ సొమ్ము వసూలు చేసి అధిష్టానానికి పంపారని అన్నారని, అది నిజం అనే భ్రమలో బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసేలోపే, మళ్ళీ బీజేపీలోకి రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.
ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్న కేటీఆర్ మాటలు ఆయన తెలివి తక్కువ తనాన్ని బయటపెడుతున్నాయని ఎద్దేవ చేస్తున్నారు. అంతేకాదు, తెలంగాణ వాళ్ళ కన్నా ఆంధ్రా వాళ్లే నయం అంటున్న కేటీఆర్, అసలు తెలివి ఉండే మాట్లాడుతున్నారా? అంటూ చురకలంటిస్తున్నారు హస్తం నేతలు. కవిత అరెస్ట్, పార్టీలో వలసలు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇలా అన్ని వరుసగా జరుగుతుండడం కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరినట్టుగా అనిపిస్తోందని అంటున్నారు.