– ఫోన్లు ట్యాప్ చేసి భార్యాభర్తల మాటలు వినడం సిగ్గుచేటు
– ఎంపీ ఎన్నికల తర్వాత కేటీఆర్ జైలుకే
– కవిత స్కాములన్నీ బయటకు వస్తున్నాయి
– పోలీస్ వాహనాల్లో డబ్బు తరలించడమేంటి?
– రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు ఖాయం
– షబ్బీర్ అలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కామారెడ్డి, స్వేచ్ఛ: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకుంటుందన్న అనుమానం నేపథ్యంలోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత కేటీఆర్ జైలుకుపోవడం ఖాయమన్నారు. ఆయనతోపాటు మరికొంత ముఖ్య బీఆర్ఎస్ నాయకులు ఊచలు లెక్కబెట్టడం పక్కా అంటూ మాట్లాడారు. కవిత లిక్కర్ స్కాంతోపాటు మరికొన్ని స్కామ్‌లకు పాల్పడ్డారని, అవి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌లో భార్యాభర్తల మాటలు వినడం సిగ్గుచేటన్న ఆయన, గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోలీసు వాహనాలలో డబ్బులు తరలించడంపై మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. పైగా, ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తోందని విమర్శించారు. రైతుల పండించిన ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న షబ్బీర్, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇటు, హైదరాబాద్ గాంధీ భవన్ మీడియాతో మాట్లాడిన కేకే మహేందర్ రెడ్డి, కేటీఆర్ అభినవ గోబెల్స్ లాగా తయారయ్యారని మండిపడ్డారు. తనను బీఆర్ఎస్‌లోకి రమ్మని ఇబ్బంది పెట్టారని, తన ఫోన్ ట్యాపింగ్ అయిందని కంప్లైంట్ ఇవ్వగానే కేటీఆర్ కి పూనకం వచ్చిందన్నారు. ఆయన ఇచ్చిన నోటీస్ చట్టానికి విరుద్ధంగా ఉందని, తననూ బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేస్తానని చెప్పారు.