Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హస్తం శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన దూకుడును లోక్ సభ ఎన్నికల్లో మరింత పెంచింది. 15 సీట్లు గెలవాలనే టార్గెట్ పెట్టుకుని రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉధృత ప్రచారం చేపడుతున్నది. ఇప్పటికే ఇక్కడి పీపుల్స్ మూడ్‌ను దాదాపుగా హస్తగతం చేసుకుంది. ఫైనల్ టచ్‌గా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా రాష్ట్రంలో పర్యటించి గెలుపు అవకాశాలను పదిలం చేయనున్నారు. ఈ అగ్రనేతల తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఒకరి వెంట ఒకరు తెలంగాణలో వరుస కార్యక్రమాలతో పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
నాలుగో దశ ఎన్నికల్లో మొత్తం 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో అత్యధిక సీట్లు ఏపీ(25).. ఆ తర్వాత తెలంగాణ(17) నుంచే ఉన్నాయి. మే 13న పోలింగ్ జరగనుంది. అందుకు రెండు రోజులు ముందుగానే ప్రచారం ముగియనుండటంతో మిగిలిన ఈ సమయం చాలా కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణలో ముమ్మర ప్రచారానికి సిద్ధం అయ్యారు. మే 5వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. 5న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని నిర్మల్‌లో ప్రచారం చేస్తారు. అనంతరం నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలోని గద్వాల్‌లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఆయన వెళ్లిపోగానే మరుసటి రోజు ఉదయమే ప్రియాంక గాంధీ రాష్ట్రంలో దిగుతారు. 6వ తేదీన ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వస్తారు. ఉదయమే ఎల్లారెడ్డిలో, మధ్యాహ్నం తాండూరులో బహిరంగ సభల్లో మాట్లాడుతారు. సాయంత్రం సికింద్రాబాద్ రోడ్ షోలో పాల్గొంటారు. 7న ఉదయం నర్సాపూర్‌లో బహిరంగ సభలో, సాయంత్రంపూట కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో రోడ్ షోలలో మాట్లాడుతారు. మళ్లీ 9వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్‌లో బహిరంగ సభలో, అదే రోజు సాయంత్రం సరూర్ నగర్‌లో బహిరంగ సభలో మాట్లాడుతారు.
Also Read: ఫిర్ ఏక్ బార్..రివర్స్ గేర్
ఎన్నికలకు ముందు చివరి రౌండ్‌లో రాహుల్ గాంధీ ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్, కరీనంగర్, మల్కాజ్‌గిరి వంటి కీలక స్థానాల్లో ప్రచారం చేసి వెళ్లుతారు. ఆదిలాబాద్, కరీంనగర్‌లో బీజేపీని ఓడించి హస్తం జెండా ఎగరేయడానికి రాహుల్ పర్యటన ఉపయోగపడనుంది. ప్రియాంక గాంధీ తన పర్యటనలో జహీరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల స్థానాల్లో ప్రచారం చేస్తారు.