– ముగిసిన యూనివర్సిటీల వీసీల పదవీ కాలం
– ఉస్మానియాలో విద్యార్థుల సంబురాలు
– కాకతీయ వర్సిటీలో వీసీ దిష్టిబొమ్మకు శవయాత్ర
– పది వర్సిటీలకు ఇంచార్జి వీసీల నియామకం
– సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు
Incharge VC: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా శాఖపై దృష్టి సారించింది. అదే విధంగా ఉన్నత విద్యాశాఖలోనూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వీసీల నియామకాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు ఇంచార్జి వీసీలను నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీకి ఇంచార్జీ వీసీగా దాన కిషోర్‌ను, జేఎన్‌టీయూకి బుర్ర వెంకటేశం, కాకతీయ వర్సిటీకి కరుణ వాకాటి, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి రిజ్వి, తెలంగాణ యూనివర్సిటీకి సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్, శాతవాహన వర్సిటీకి సురేంద్ర మోహన్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీకి జయేష్ రంజన్, పాలమూరు విశ్వవిద్యాలయానికి నదీం అహ్మద్‌లను ఇంచార్జీ వీసీలుగా నియమించింది.
ఓయూలో విద్యార్థుల సంబురాలు
చాలాకాలంగా వీసీల మార్పు లేకపోవడంతో కొన్ని యూనివర్సిటీలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వారంతా మారిపోవడంతో విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థులు స్వీట్లు పంచుకున్నారు. విద్యార్థుల సమస్యలను ఇన్నాళ్లూ వీసీ పట్టించుకోలేదన్నారు. అయితే, పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
కాకతీయ వర్సిటీలో శవయాత్ర
కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్ పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం రసాభాసగా మారింది. పార్ట్ టైం టీచింగ్ స్టాఫ్ ఆందోళన చేశారు. తమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. అలాగే, విద్యార్థి సంఘాల నాయకులు వీసీ దిష్టిబొమ్మను వర్సిటీ లైబ్రరీ నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు శవయాత్ర చేపట్టారు. మూడేళ్ల పాలనలో ఆయన వర్సిటీని నాశనం చేశారని, ఇప్పటికి పీడ విరగడైందని మండిపడ్డారు. పీహెచ్‌డీ సీట్లల్లో అవకతవకలు చేశారని, అధికార దుర్వినియోగం చేశారని, రమేష్ పాలనా కాలంలో జరిగిన అవినితి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.