– ఆరు నెలల్లోనే రెండు స్కాములు బయటపడ్డాయి
– వాటిని డైవర్ట్ చేయడం కోసమే ట్యాపింగ్ హడావుడి
– లీకేజ్‌లతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం జరుగుతోంది
– నిజాలు తేలితే కేసులు పెట్టి జైలులో పెట్టాలి
– కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఫైర్
BRS MLA Sanjay: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగు చూస్తుండగా, బీఆర్ఎస్ కీలక నేతలు మౌనంగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే, కొందరు గులాబీ నేతలు మాత్రం తమదైన రీతిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గత ఆరు నెలల నుండి లీకులు, స్కాముల మీదనే ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు లిక్కర్ స్కామ్ బయటికి వచ్చిందని, అలాగే, వడ్ల స్కామ్ వెలుగు చూసిందని, అందుకే, ఫోన్ ట్యాపింగ్ అంటూ హడావుడి జరుగుతోందని విమర్శించారు. లీకేజ్‌లతో తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం జరుగుతోందన్నారు సంజయ్. ఫోన్ ట్యాపింగ్‌లో నిజానిజాలు మొత్తం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్కాంగ్రెస్‌గా మారిందన్న ఆయన, తెలంగాణలో గుడుంబాని మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో నిజాలు తేలితే కేసులు పెట్టి జైలుకు పంపాలన్నారు.
పండించిన వరి పంటకు ఇస్తానన్న 500 బోనస్ ఇవ్వడం లేదన్న ఆయన, కాళేశ్వరం రిపేర్ చేయరాదన్న ప్రభుత్వమే ఇప్పుడు చేయిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్లు, ట్యాంకర్లలో నీరు కొనుక్కునే పరిస్థితి దాపురించిందని విమర్శించారు. కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్‌కి మూడవ స్థానం వచ్చిందని, ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోయానని కాంగ్రెస్ అభ్యర్థి చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఐదు సార్లు పోటీ చేసినా గెలవని జువ్వాడి నర్సింగరావు, ఇప్పుడు కలెక్షన్ రాజాగా మారారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌లో అరెస్ట్ అయిన వారితో నలుగురి పేర్లు చెప్పించారని సంజయ్ కుమార్ మండిపడ్డారు.