Khammam: కాంగ్రెస్ అధిష్టానం మిగిలిన మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. చివరి దాకా ఉత్కంఠను రేపిన ఖమ్మం సీటులో పోటీ చేయనున్న అభ్యర్థిని ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కరీంనగర్ నుంచి రాజేందర్ రావు, హైదరాబాద్ నుంచి సమీర్ ఉల్లాఖాన్‌ను అభ్యర్థులుగా పార్టీ నిర్ణయించింది. ఖమ్మం సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాం రెడ్డి ఖరారయ్యారు. కరీంనగర్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా టికెట్ ఆశించారు. కానీ, ఆయనకు కాంగ్రెస్ టికెట్ రాలేదు. అయితే.. అల్గిరెడ్డి ప్రవీణ్ కూడా కరీంనగర్ లోక్ సభ సీటులో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు.
ఖమ్మం అభ్యర్థి ఎవరనే దానిపై చివరి దాకా ఉత్కంఠ సాగింది. చివరకు మంత్రి పొంగులేటి వియ్యంకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాం రెడ్డికే కాంగ్రెస్ టికెట్ దక్కింది. ఖమ్మం స్థానికుడైన రఘురాం రెడ్డినే పార్టీ అభ్యర్థిగా ఎంచుకుంది. ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ ఆశించినప్పటికీ పార్టీ వారికి టికెట్ ఇవ్వలేదు. మంత్రి పొంగులేటి పార్టీలో చేరే ముందే ఎంపీ టికెట్ పై ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది.