– ఆసక్తికరంగా మెదక్ రాజకీయం
– పోటాపోటీగా పార్టీల ఫిర్యాదులు
– ఇప్పటికే రఘునందన్ రావు, వెంకట్రామిరెడ్డిపై కేసులు
– కొత్తగా ఈసీకి కాంగ్రెస్ నేతల కంప్లయింట్
BJP news in Telangana(TS politics): మెదక్ పార్లమెంట్ స్థానం కోసం పార్టీలన్నీ దూకుడుగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన అభ్యర్థులు, విమర్శల యుద్ధంలోనూ సై అంటే సై అంటున్నారు. ఇంకోవైపు, పోటాపోటీగా ఫిర్యాదు చేసుకుంటున్నారు.
ఒకరిపై ఒకరు పోలీసులకో, ఎన్నికల కమిషన్‌కో కంప్లయింట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బీఆర్ఎస్ నేతలపై అసభ్య పదజాలం వాడారని ఎన్నికల కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.
రఘునందన్ రావుపై సంగారెడ్డి టౌన్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అలాగే, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించడం వివాదాస్పదమైంది. దీనిపై ఎన్నికల కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. ఈ క్రమంలోనే వెంకట్రామిరెడ్డి, మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిపై సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
తాజాగా, ఈసీకి రఘునందన్ రావుపై మరో ఫిర్యాదు అందింది. తన ఫోటో, ప్రధాని మోడీ, బీజేపీ గుర్తుతో ఉన్న క్యాలెండర్‌ను ఓటర్లకు పంచుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. రఘునందన్ రావుని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని లేఖ రాశారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.