– సికింద్రాబాద్‌లో ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో వారిదే అధికారం
– అందుకే, దానం నాగేందర్‌ను బరిలోకి దింపాం
– దేశంలో ఇండియా కూటమి గెలవబోతోంది
– కేంద్రంలో దానం కీలక బాధ్యత నిర్వహించబోతున్నారు
– బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులయినా హైదరాబాద్‌కు చేసింది శూన్యం
– కాంగ్రెస్ వల్లే జంట నగరాల్లో మెట్రో రైలు పరుగులు
– పద్మారావు నామినేషన్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదు?
– లక్ష మెజారిటీతో దానం నాగేందర్‌ను గెలిపించాలన్న సీఎం రేవంత్
Revanth Reddy latest news(Telangana politics) : కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈసారి సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్‌లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే, ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. 2004, 2009లో సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలిచిందని, కేంద్రంలో కూడా ఏర్పడిందని గుర్తు చేశారు. ఈసారి మళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతోందని జోస్యం చెప్పారు. ‘‘నాడు దత్తాత్రేయను ఓడించి అంజన్ కుమార్ యాదవ్ మూడు రంగుల జెండా ఎగురవేశారు. సోనియా గాంధీ నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 20 ఏళ్ల తరువాత ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి దానం నాగేందర్ కాంగ్రెస్ జెండా ఎగురవేయనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మళ్లీ కాంగ్రెస్సే. దానం గెలిచి కేంద్రంలో మంత్రి పదవి చేపట్టనున్నారు. బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులైనా సికింద్రాబాద్‌కు చేసిందేమీ లేదు. జంట నగరాలకు మెట్రో రైలు రావడానికి కాంగ్రెస్ సర్కారే కారణం. హైదరాబాద్ వరదల సమయంలో కిషన్ రెడ్డి కేంద్రం నుంచి చిల్లి గవ్వ అయినా తీసుకొచ్చారా’’ అంటూ మండిపడ్డారు.
పద్మారావు పరువు తీసేందుకే
బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ మంచోడే కానీ, ఆయన పరువు తీయడానికి కేసీఆర్ పోటీలో నిలబెట్టారని అన్నారు రేవంత్ రెడ్డి. పద్మారావు గౌడ్ నామినేషన్ కార్యక్రమానికి కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆయన్ను ఓడించి కిషన్ రెడ్డిని గెలిపించే ప్లాన్ చేశారని ఆరోపించారు. సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనని ఎద్దేవ చేశారు. పేద ప్రజలు దానం నాగేందర్ కు అండగా ఉన్నారన్నారు రేవంత్ రెడ్డి.
ఈ ప్రభుత్వం మనది.. సంక్షేమం మనది
సికింద్రాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అక్కడకు వచ్చిన ప్రజలతో అన్నారు రేవంత్ రెడ్డి. ‘‘బస్తీల్లో ప్రజల కష్టాలు తీరాలంటే సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్‌ను గెలిపించండి. ఈ ప్రభుత్వం మనది. సంక్షేమం మనది. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం చేసే బాధ్యత మాది. నగరానికి కృష్ణా, గోదావరి జలాలు తెచ్చింది ఎవరో చర్చ పెడదాం. జంట నగరాల దాహార్తిని తీర్చింది ఎవరో చర్చ పెడదాం. ఇందుకు కేటీఆర్ సిద్ధమా?’’ అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీని ఓడించాలంటే దానం నాగేందర్‌ను గెలిపించాలని, అనిల్ కుమార్ యాదవ్, దానం జోడెద్దుల్లా తనకు అండగా ఉన్నారని, నగరాన్ని అభివృద్ధి చేస్తారన్నారు రేవంత్ రెడ్డి.
లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యం
ఉద్యోగాలు ఇస్తానని, ఇండ్లు ఇస్తామని మోదీ మోసం చేశారన్నారు సీఎం. తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టి మోదీ తెలంగాణను అవమానించారని, హిందూవుల ఆస్తిని ముస్లింలకు పంచుతారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మోదీ ఇలా మాట్లాడటం సరైంది కాదన్న రేవంత్ రెడ్డి, ఒకరి ఆస్తి ఇంకొకరికి ఎలా పంచుతారని ప్రశ్నించారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, లక్ష మెజారిటీతో దానం నాగేందర్‌ను గెలిపించాలని ప్రజలను సీఎం కోరారు.