- సరికొత్త వ్యూహాలతో పార్లమెంట్ ప్రచార భేరి మోగించనున్న రేవంత్ రెడ్డి
- సొంత జిల్లా నుంచి 25 దాకా పార్లమెంట్ నియోజకవర్గాలలో ప్రచారం
- ఒక్కో పార్లమెంట్ స్థానం పరిధిలో రోజుకు 3 బహిరంగ సభలు
- 50 బహిరంగ సభలు, 15 చోట్ల రోడ్ షోలు
- హెలికాప్టర్ ద్వారా ప్రచారం నిర్వహించనున్న సీఎం
- పొరుగు రాష్ట్రాలలోనూ పార్టీ ప్రచారకర్తగా రేవంత్ రెడ్డి
- వచ్చే నెల 11 దాకా రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్
- కాంగ్రెస్ కు అన్నీ తానై గత ఎన్నికలలో పార్టీకి పూర్వవైభవం తెచ్చి అధిష్టానాన్ని మెప్పించి సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి వచ్చిన కొద్ది రోజులకే తనదైన దూకుడు ప్రారంభించారు. అప్పుడు రాష్ట్రమంతటా రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో హోరెత్తించిన రేవంత్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలోనూ తనదైన శైలిని చూపించబోతున్నారు. మిషన్-15 పేరుతో ఈ పార్లమెంట్ ఎన్నికలలో తన సత్తా చాటనున్నారు. ఒక పక్క పార్టీ క్యాడర్ కు నూతనోత్సాహం ఇస్తూ..పార్టీలో అసమ్మతులను బుజ్జగిస్తూ…కొత్త చేరికలను ఆహ్వానిస్తూ…అప్పుడప్పుడూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ సాగిపోతున్నారు.
ఇప్పుడు మిషన్-15 టాస్క్‌లో భాగంగా సీఎం రేవంత్ లోక్‌సభ ఎన్నికలు ముగిసేంతవరకూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు ప్లానింగ్ ఖరారైంది.
సొంత జిల్లాతో మొదలు
సొంత జిల్లా మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానం నుంచే దీనికి శ్రీకారం చుడుతున్నారు. పాలమూరు ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమం మొదలు ఈ నెల 25న నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకూ ఆయన పలు ఎంపీ సెగ్మెంట్లలో నామినేషన్ల కార్యక్రమానికి హాజరయ్యేలా షెడ్యూలు రూపొందించుకున్నారు.. ఈ నెల 20న మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, 21న భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి, 22న ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ, 23న నాగర్‌కర్నూల్ అభ్యర్థి మల్లు రవి, 24న జహీరాబాద్ అభ్యర్థి సురేశ్ షేట్కర్ నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు షెడ్యూలు ఖరారైంది.
ప్రతి సెగ్మెంట్ లో మూడేసి సభలు
నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో వచ్చే నెల 11 వరకు జరిగే ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ షెడ్యూల్ ను సమకూర్చుకున్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్‌ను కూడా సమకూర్చుకున్నారు. ఒక్కో పార్లమెంటు స్థానంలో కనీసంగా 3 భారీ బహిరంగసభలను నిర్వహించేలా పార్టీ ఇప్పటికే ప్రోగ్రామ్‌ను రూపొందించింది. మొత్తం 17 నియోజకవర్గాల్లో 50 బహిరంగసభలు, 15 చోట్ల రోడ్ షో లు నిర్వహించేలా పీసీసీ ఆలోచిస్తున్నది. బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావించిన కాంగ్రెస్ ఈ ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, మోడీ పదేండ్ల పాలనలోని ఫెయిల్యూర్స్‌ను ఎండగట్టాలన్నది కాంగ్రెస్ ఆలోచన. బీఆర్ఎస్‌తో పెద్దగా పోటీ లేదని స్వయంగా ఆయన, మంత్రులు వ్యాఖ్యానిస్తుండటంతో ఒకటి రెండు చోట్ల మాత్రమే ఆ పార్టీతో తలపడాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్
తెలంగాణకు మాత్రమే రేవంత్‌రెడ్డిని పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఆయనను క్యాంపెయిన్‌కు వాడుకోవాలని ఏఐసీసీ భావించింది. ఇందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్‌కు పంపిన నేషనల్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రేవంత్‌రెడ్డి పేరును పెట్టింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు బీహార్, గుజరాత్ రాష్ట్రాల పీసీసీలకు కూడా సమాచారాన్ని ఇచ్చింది. రేవంత్‌రెడ్డి హాజరయ్యేలా సభలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే కేరళలో పర్యటించిన రేవంత్‌రెడ్డి..రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న ఆళప్పుజ సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. ఏపీలో ఒక సభకు హాజరైన రేవంత్.. రానున్న రోజుల్లో మరికొన్ని సభలకూ అటెండ్ కానున్నారు. ఈ నెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్‌లో పాల్గొన్న అనంతరం కర్ణాటకలో ప్రచారానికి వెళ్లనున్నారు.