Will Carry Out Rs Two Lakh Farm Loan Waiver Before Aug 15 CM Revanth Reddy
Politics

Congress Party: ఆరు నూరైనా, రుణమాఫీ పక్కా!

– కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు జరుగుతున్నాయి
– మోడీతో కేసీఆర్ కలిసిపోయారు
– రాష్ట్రాన్ని బొందల గడ్డగా మార్చారు
– పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓటమి తప్పదు
– ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతాం
– యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మార్చబోతున్నాం
– ఉద్యమం మాటున కేసీఆర్ దొంగ దీక్షలు చేశారు
– ఆంధ్రావాళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారు
– నాతోపాటు సీఎం పదవికి కోమటిరెడ్డి అర్హుడు
– భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
– కార్నర్ మీటింగ్ లో బీజేపీ, బీఆర్ఎస్ పై ఫైర్

CM Revath Reddy guarantee Farm Loan Waiver: లోక్ సభ ఎన్నికల్లో అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలా సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం భువనగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమం మాటున కేసీఆర్ దొంగ దీక్షలు చేశారని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు సోనియాగాంధీ తెలంగాణ ప్రకటించారని చెప్పారు. కానీ, తానే తెలంగాణ తెచ్చానని కేసీఆర్ ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీకి భారీ షాకులు తప్పవని అన్నారు. కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న సీఎం, మోడీతో కలిసి కేసీఆర్ తెలంగాణను బొందల గడ్డగా మార్చారని ఫైరయ్యారు. మోడీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలాయని విమర్శించారు. భువనగిరి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని, బీఆర్ఎస్, బీజేపీలను బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పందేళ్లపాటు మోడీతో కేసీఆర్ కలిసే ఉన్నారని అన్నారు. హైదరాబాద్ లోని ఆంధ్రావాళ్లను బెదిరించి కేసీఆర్ లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. తెలంగాణ కోసం పదవిని సైతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వదలుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు. 2009లో ఢిల్లీ దద్దరిల్లేలా తెలంగాణ నినాదాన్ని వినిపించారని, కోమటిరెడ్డి బ్రదర్స్ నిబద్ధత గల కాంగ్రెస్ సైనికులని తెలిపారు.

Also Read:మోడీ పాలనలో రైలు వ్యవస్థ ఎవరికి చేరువైంది?

తనతోపాటు ఎవరికైనా ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే అని చెప్పారు. వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు డబుల్ ఇంజన్లని అభివర్ణించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డిపైనా మండిపడ్డారు రేవంత్. దొర గడీలో సారా పోసిన వ్యక్తి అంటూ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నామన్న ఆయన, ఒక విజన్ తో అహర్నిశలు పని చేస్తున్నామని వివరించారు. పేదవాడి సంక్షేమం కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. భువనగిరి కాంగ్రెస్ కంచుకోట అని మరోసారి నిరూపించాలని కోరారు. అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని 3 లక్షల మెజారిటీతో గెలిపించాలన్నారు. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మార్చుతున్నట్టు ప్రకటించారు. ప్రపంచం తలకిందులైనా రుణమాఫీని ఆపమని, ఆగస్టు 15లోపు చేసి తీరుతామని స్పష్టం చేశారు సీఎం. ఎన్నో పోరాటాలు చేసిన కమ్యూనిస్టులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.