Revanth Reddy news today(Telangana congress news): గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన సీనియర్ ఐపీఎస్, విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ భౌతికకాయానికి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. డీజీపీ రవిగుప్తా, నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌లు కూడా రాజీవ్ రతన్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం, ఆయన భౌతికకాయాన్ని తమ భుజాలపై మోసారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. గాల్లో మూడు రౌండ్లు కాల్పులు జరిపి పోలీసులు నివాళులు అర్పించారు. రాజీవ్ రతన్ అంత్యక్రియలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర పోలీసు ఉన్నత అధికారులు హాజరయ్యారు.
రాజీవ్ రతన్ చనిపోవడానికి ముందు తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్‌కు పోలీసు శాఖలో మంచి పేరు ఉన్నది. సమర్థవంతమైన అధికారిగా ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ కమిటీకి ఆయనే సారథిగా వ్యవహరించారు.
Also Read: ఆలు లేదు.. చూలు లేదు..! టికెట్ లేకున్నా క్యాంపెయిన్ కోసం కసరత్తు!
అంతేకాదు, గతంలో కరీంనగర్ ఎస్పీగా, ఫైర్ సర్వీసెస్ డీజీగానూ పని చేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగానూ పలుహోదాల్లో పని చేశారు. గతేడాది డీజీగా మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేసినప్పుడు ఆ పదవి కోసం అధికారుల ఎంపిక జరుగుతుండగా రాజీవ్ రతన్ పేరు కూడా వినిపించింది. అయితే.. ఆయనను డీజీపీగా నియమించకున్నా.. విజిలెన్స్ డీజీగా ప్రమోషన్ పొందారు.