Revanth Reddy today news(Latest news in telangana): రైతులు తమ ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్‌కు తరలిస్తున్నారు. చాలా చోట్ల అధికారులతో వ్యాపారులు కుమ్మక్కై ధరలను తగ్గించి రైతులను మోసం చేస్తున్న ఘటనలు బయటికి వస్తున్నాయి. బుధవారం జనగామ వ్యవసాయ మార్కెట్‌లో చోటుచేసుకున్న ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన వ్యవసాయ మార్కెట్‌లోని అధికారులనూ ఆయన అలర్ట్ చేశారు. రైతులను మోసం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. సీఎం వార్నింగ్ ఇచ్చినా కొన్ని చోట్ల ఈ ఆగడాలు చోటుచేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర, రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదుల గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి.
సెక్రెటేరియట్‌లో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత విభాగాలపై సమీక్ష చేసే అవకాశం ఉన్నది. ఈ సమీక్షలో ధాన్యం కొనుగోళ్లు, తాగు నీటి సరఫరాపై చర్చించనున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి జనగామ వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన ఓ ఘటనపై స్పందించారు. రైతులను మోసం చేసే ప్రయత్నం చేసిన వ్యాపారులు, నిర్లక్ష్యం వహించిన అధికారిపై యాక్షన్ తీసుకున్న అడిషనల్ కలెక్టర్‌ను అభినందించారు.
Also Read: ‘ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తే సహించేది లేదు’
జనగామ వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం 250 మంది రైతులు ధాన్యాన్ని మార్కెట్‌కు తెచ్చారు. ధాన్యంలో తేమ, తాలు సాకుతో ట్రేడర్లు క్వింటాకు రూ. 1551, రూ. 1569, రూ. 1659 చొప్పున ధర డిసైడ్ చేశారు. వాస్తవానికి ప్రభుత్వం క్వింటాకు ధర రూ. 2203 నిర్ణయిస్తే రూ. 1500 ఇవ్వడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను, వ్యాపారులను నిలదీశారు. లేదంటే తమ ధాన్యాన్ని తగులబెడతామని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ వ్యవసాయ మార్కెట్ వచ్చారు. రైతులతో మాట్లాడి జరుగుతున్న మోసాన్ని గ్రహించారు. అధికారులు ఇచ్చిన చీటీలపై వ్యాపారులు రాసిన ధరలను చూసి షాక్ అయ్యారు. వెంటనే తక్కువ ధరలు నిర్ణయించిన నలుగురు వ్యాపారులపై క్రిమినల్ కేసులు మోపాలని, వెంటనే ఫిర్యాదు చేయాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రసాద్‌ను ఆదేశించారు. కనీస మద్దతు ధరతోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అడిషనల్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు స్థిమితపడ్డారు.