Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ 5వ తేదీన లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారంటీల పేరుతో న్యాయ పత్రాన్ని వెల్లడించింది. ఇందులో మహిళలు, అన్నదాతలు, యువత, కార్మికులు, భాగీదారీలకు ఐదేసి చొప్పున మొత్తం 25 గ్యారంటీలను ప్రకటించింది. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ హామీలను అమలు చేస్తామని చెప్పింది. ఆ తర్వాతే తెలంగాణలో నిర్వహించిన సభలోనూ ఈ హామీలను కాంగ్రెస్ నాయకులు ప్రస్తావించారు. దీనికి అదనంగా తెలంగాణకు ప్రత్యేకంగా మరో మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్రకటించే నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ స్పెషల్ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు దక్కే ఫలాలు, చేకూరే ప్రయోజనాలు ఈ మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్టు తెలిసింది. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, రహదారులు, రైల్వే లైన్లకు సంబంధించిన హామీలను ఈ స్పెషల్ మేనిఫెస్టోలో పేర్కొనే అవకాశం ఉన్నది. తెలంగాణ విడిపోయాక అమలు కావాల్సిన విభజన హామీలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ అటకెక్కించింది. ఈ అంశంపైనా కాంగ్రెస్ ఇక్కడ విమర్శలు గుప్పిస్తున్నది.
Also Read: చిరుత.. దోబూచాట
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ముందస్తుగా గ్యారంటీలను ప్రకటించి వెళ్లితే సత్ఫలితాలను సాధిస్తున్నది. కర్ణాటకలో ఇలాగే గ్యారంటీలను ప్రకటించి ఎన్నికలకు వెళ్లగా ఘన విజయాన్ని నమోదు చేసింది. తెలంగాణలోనూ స్వల్ప సమయంలోనే పార్టీ పురుజ్జీవమై.. ఆరు గ్యారంటీలతో ఏకంగా రాష్ట్రంలో అధికార పీఠాన్ని అధిరోహించింది. ఇప్పుడు కేంద్రంలోనూ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతున్నది. ఈ రాష్ట్రాల తరహాలోనే లోక్ సభ ఎన్నికలకూ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ప్రకటించింది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మాదిరే.. లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ వేగంగా పుంజుకుంటున్నది.