PM Modi: గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణపై పెత్తనం చేస్తామంటే కుదరదని ప్రధాని మోదీపై ఫైరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కోరుట్ల జన జాతర సభలో ఆయన పాల్గొని జీవన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ ఏర్పాటు సాకారం కావడంలో కార్మికుల పోరాటం ఎంతో ఉందన్నారు. ఈ ఎన్నికలు ఆషామాషీవి కావని, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని చెప్పారు. అందుకే, 400 సీట్లు గెలవాలని కోరుకుంటోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ భావిస్తోందన్న రేవంత్, ఆ కుట్రలను తిప్పికొట్టేందుకు తాను బహిరంగంగా ప్రశ్నించానని చెప్పారు. దానికి పగ బట్టి ఢిల్లీలో కేసు పెట్టారని, స్వయంగా హోంశాఖనే తనపై కేసు పెట్టిందని చెప్పారు.
ఈడీ, సీబీఐ, ఐటీనే కాదు ఢిల్లీ పోలీసులను పంపి భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు సీఎం. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని, మద్దతుగా తెలంగాణ ప్రజలు ఉన్నారని చెప్పారు. గతంలో ఇలాగే వ్యవహరించిన కేసీఆర్‌ను అసెంబ్లీలో ఎన్నికల్లో ప్రజలు వంద మీటర్ల గోతి తీసి బొంద పెట్టారని గుర్తు చేశారు. గుజరాత్ ఆధిపత్యం ప్రదర్శించి తెలంగాణను అవమానిస్తే ఎదిరించి నిలబడతానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఈ ప్రాంతానికి ఏం ఇస్తారో చెప్పకుండానే ప్రధాని ఇక్కడికి వచ్చి వెళ్లిపోయారని విమర్శించారు.
Also Read: కొత్త పింఛన్లు మంజూరు, కొత్త రేషన్ కార్డులు జారీ..: మంత్రి పొన్నం
‘‘విభజన హామీలపై, పసుపు బోర్డు అంశాలపై ఏదైనా చెబుతారేమో అనుకున్నాం. కానీ అవేవీ చెప్పకుండా కాంగ్రెస్ ముఖ్త్ భారత్ అంటున్నారు. కాంగ్రెస్ ముఖ్త్ భారత్ అంటే రిజర్వేషన్లు రద్దు చేయడమేనా? మోదీని మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు అడిగా. ఆ విషయం మాట్లాడలేదు. హైదరాబాద్ దాహార్తి కోసం నీటిని కేటాయించాలని కోరితే ఇవ్వలేదు. మోదీ స్థాయికి అబద్ధాలు మాట్లాడటం తగదు. రిజర్వేషన్లు ఉండాలని చెబితే నాపై కేసులు పెడతారా? నా రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రినే బెదిరిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఖబర్దార్ మోదీ. ఇయ్యాల నన్ను ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని హుకుం జారీ చేశారు. మోదీ ఇదేనా మీ విధానం. ఆధిపత్యం చలాయించి భయపెడతామంటే నిజాంలకు, రాజాకార్లకు పట్టిన గతే బీజేపీకి పడుతుంది. పదేళ్లలో మోదీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే. గాడిద గుడ్డు తెచ్చిన వాళ్లకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలా? 43 ఏళ్లుగా జీవన్ రెడ్డి పదవులకు వన్నె తెచ్చారు. కానీ, ఏనాడు పదవిని అడ్డు పెట్టుకుని అవినీతికి పాల్పడలేదు. నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించి.. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా చేసుకుందాం’’ అని చెప్పారు రేవంత్ రెడ్డి.