- బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే!
- బీజేపీ కోసమే బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులు
- ఈ కుట్రలను తిప్పికొట్టడానికే భారీ వర్షంలో సైతం వరంగల్‌కు వచ్చా
- పదేళ్లు ఏమివ్వకుండా మోదీ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు?
- ప్రజలు ఓడించినా కేసీఆర్ వంకర బుద్ధి మారలేదు
- కేటీఆర్ తలకిందులుగా తిరిగినా కారు తూకానికే
CM Revanth Reddy on BJP, BRS(Telangana politics): బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని లెఫ్ట్ పార్టీలు అండగా నిలిచాయని తెలిపారు. కాకతీయ సంస్థానం అంటే ప్రజా పాలనకు పెట్టింది పేరని చెప్పారు. వరంగల్ పౌరుషానికి, నమ్మిన జాతి కోసం ప్రాణాలు ఇచ్చిన సమ్మక్క, సారలమ్మ ఆదర్శమని తెలిపారు. పరిపాలనలో సరళీకృత విధానాలను తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చేసిన పీవీ నరసింహరావు, ప్రజల కోసమే జీవించిన కాళోజీ, మలి దశ తెలంగాణ ఉద్యమ సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ ఇక్కడి వారేనని గుర్తు చేశారు. ఏ ఉద్యమమైనా కాకతీయ యూనివర్సిటీ గడ్డపైనే మొదలు అవుతుందన్నారు సీఎం.
తులసి వనంలో గంజాయి మొక్కలు ఉన్నట్టు వరంగల్‌లో ఎర్రబెల్లి, ఆరూరి రమేష్ లాంటి వాళ్లు ఉన్నారని విమర్శలు చేశారు. భూములు ఎక్కడ కనిపించినా గద్దల్లా వాలేవాళ్లు, అనకొండల్లా మింగేవాళ్లు ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో పోటీలో ముగ్గురు అభ్యర్థులు కనిపించినా, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీలు వేర్వేరు కాదని, కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలని కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసిందన్నారు. అందులోభాగంగానే ఆరూరి రమేష్ బీజేపీలోకి వెళ్లారని, అభ్యర్థులను గెలిపించుకోవాలని ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడైనా బయటకు వస్తున్నారా? అని ప్రశ్నించారు.
Also Read: ‘అమితో’త్సాహం
బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టడానికే భారీ వర్షం పడినా ఇక్కడకు వచ్చానన్న సీఎం, బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పాకే ప్రధాని మోదీ ఇక్కడకు రావాలన్నారు. విభజన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని, తెలంగాణకు వచ్చే పరిశ్రమలను గుజరాత్‌కు తరలించుకుపోయారని విమర్శించారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును ఎందుకు పూర్తి చేయలేదన్న ఆయన, ఎయిర్ పోర్టును కూడా అధ్వాన్నంగా మార్చారని అన్నారు. పదేళ్లు ప్రధానిగా ఉండి మోదీ ఏం చేయలేదని, ఏ ముఖం పెట్టుకుని బీజేపీవాళ్లు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని, అందుకే ప్రజలు ఆయన్ను ఓడించారని, అయినా, ఆయన బుద్ధి మారలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఆయన వంకర ఆలోచనలో మార్పు రాలేదన్నారు. కారు రిపేర్ కాదు, కేటీఆర్ తలకిందులుగా తిరిగినా తూకానికి వేయడమేనని సెటైర్లు వేశారు.