– ప్రగతిశీల శక్తులకు చిరునామా.. కేరళ
– మాటల మోదీ ఇక ఇంటికి పోవాల్సిందే
-కేరళ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్
-అనంతరం హస్తిన వెళ్లిన సీఎం
– సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు ఆహ్వానాలు
PM Modi: ఈ సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని చెబుతున్న ప్రధాని మోదీ పార్టీ ఇంటికి పోబోతోందని, ఆయన గ్యారెంటీలకు వారెంటీ ముగిసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం కేరళలోని కోజికోడ్‌లోలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళ కమిటీ ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రగతి శీల భావాలకు ప్రతీకగా కేరళ నిలిచిందని, ఏనాడూ ఈ రాష్ట్ర ప్రజలు మతతత్వ శక్తులకు చోటివ్వలేదని కొనియాడారు. తమ నేత రాహుల్ గాంధీని ఈసారి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించాలని కోరినా, ఆయన కేరళ తన కుటుంబమని చెప్పిన సంగతిని వెల్లడించారు. దేశంలో 400 సీట్లు గెలుస్తామని చెబుతున్న పార్టీ ఇంటిదారి పట్టాల్సిందేనని జోస్యం చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకే వారు 400 సీట్లు కోరుతున్నారన్నారు. దక్షిణ భారతంలోని 130 సీట్లలో 100 సీట్లు ఇండియా కూటమికే దక్కనున్నాయని, ఉత్తరాదిలోని అనేక కీలక రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ హవా లేదని వివరించారు. రెండు సార్లు ప్రధానిగా మోదీకి ప్రజలు అవకాశమిచ్చారని, ఆయన దానిని దుర్వినియోగం చేశారన్నారు. మోదీ ఇస్తున్న గ్యారెంటీలకు వారెంటీ అయిపోయిందని కౌంటర్ ఇచ్చారు. ‘స్నేహ సదస్’ పేరుతో విడుదవుతున్న పుస్తకం దేశంలోని మతతత్వ శక్తులను ఓడించాలనుకునే వారికి ఒక ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
సోమవారం కేరళకు వెళ్లటానికి ముందు ఉదయం సమయంలో సీఎం తెలంగాణ ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశంతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నానికి సంబంధించిన 12 వేర్వేరు నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించి, వాటిలో ఒకదానిని ఖరారు చేసినట్లు సమాచారం. తెలంగాణ చారిత్రక నేపథ్యంతో బాటు ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం భావనలూ చిహ్నంలో ప్రతిబింబించేలా ఈ చిహ్నం ఉండాలని సీఎం సీఎం భావిస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఖరారు చేసిన ఈ చిహ్నాన్ని జూన్ 2న అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు. ఇక రాష్ట్ర గీతంగా ఖరారు చేసిన ‘జయ జయహే తెలంగాణ’కు అవసరమైన మార్పులను రచయిత అందెశ్రీ పూర్తి చేయగా, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరకల్పన చేశారు. ఈ గీతాన్ని కూడా జూన్ 2న ఆవిష్కరించనున్నారు. మరోవైపు తెలంగాణ తల్లి రూపం కూడా ఓ కొలిక్కి వస్తున్నట్లు సమాచారం.
కేరళ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి నేరుగా ఢిల్లీ వెళ్లారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణవేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని రేవంత్‌రెడ్డి ఆహ్వానించనున్నారు. అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ఆయన కలిసి వేడుకలకు రావాలని ఆహ్వానించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే షెడ్యూల్ కూడా ఈ పర్యటనలో ఖరారు కానుంది. పంజాబ్‌లో చివరి విడతలో భాగంగా జూన్ 1న జరిగే ఎన్నికలు జరనున్న సంగతి తెలిసిందే.