Revanth reddy fire on KCR(Political news in telangana): ఉస్మానియా యూనివర్సిటీ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ తరుచూ కరెంట్ కోతల గురించి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మొన్న సూర్యపేటలో అదే పని చేసి తేలిపోయాడని, నిన్న మహబూబ్‌నగర్‌లోనూ కరెంట్ కోత వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యాడని, ఇప్పుడు కొత్తగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే నెలలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి ఇలాంటి నోటీసే ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అప్పుడు కూడా ఆ నోటీసులో నెల రోజులపాటు మెస్ మూసివేయడం ప్రస్తావించి.. విద్యుత్, నీటి కొరతల గురించి కూడా పేర్కొన్నారని స్పష్టం చేశారు. అప్పుడు 12. 05. 2023 నుంచి 05.06.2023 వరకు సెలవులు ప్రకటించారని వివరించారు. ఇప్పుడు కూడా అలాంటి నోటీసునే చీఫ్ వార్డెన్ జారీ చేశారని తెలిపారు. ఇందులో తేడా ఏమున్నదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన, దివాళా కోరు ప్రచారాన్ని కేసీఆర్ చేస్తున్నారని, ఇది ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ట అని అన్నారు.
Also Read: కార్మికులు, కర్షకులకు ‘ఏదీ గ్యారెంటీ ’
యూనివర్సిటీలో ఈ సెలవు రోజుల్లో నీటి కొరతను ప్రశ్నిస్తూ విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. విద్యార్థుల నిరసనను కేసీఆర్ పేర్కొంటూ కాంగ్రెస్ పై విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. ఉస్మానియా వర్సిటీకి సంబంధించిన అంశాన్ని పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు, సాగు నీటి, తాగు నీటి కొరత ఉన్నదని కేసీఆర్ ట్వీట్ చేశారు. కానీ, సీఎం, డిప్యూటీ సీఎంలు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తున్నదని విమర్శించారు. హిట్లర్ సమయంలో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు గోబెల్ ప్రచారం చేసేవాడు. ప్రజలను ఆయన సమర్థవంతంగా తప్పుదారి పట్టించేవాడు.