– ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది
– పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం
– ఫోన్లు ట్యాప్ చేసే స్థాయికి మేము దిగజారిపోం
– కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు చర్చిస్తాం
– తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు
– అవి గుర్తుకు వచ్చేందుకే అధికారిక చిహ్నం, గేయం
– మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్
KCR: ఢిల్లీ పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి మీడియాతో ముచ్చటించారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని, తమ పాలనను విమర్శించే అవకాశం కూడా ప్రత్యర్థి పార్టీలకు ఉండటం లేదని తెలిపారు. వారికి ఆ అవకాశం ఇవ్వకుండానే ప్రజా పాలన సాగిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయని వివరించారు.
ఇదే సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన తెచ్చారు రేవంత్. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉన్నదని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ అనేక విమర్శలు వచ్చాయని, అధికారులపై ఆరోపణలు వచ్చాయని సీఎం గుర్తు చేశారు. ఆరోపణలు ఉన్న అధికారుల బదిలీలు జరిగాయని పేర్కొన్నారు. కానీ, తెలంగాణలో అలాంటి విమర్శలు, ఆరోపణలకు అవకాశం లేని విధంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేసిందని వివరించారు. అధికార దుర్వినియోగం అనే ఆరోపణలకూ ఆస్కారం లేకుండా చూసుకున్నామని తెలిపారు.
కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణనలోకి తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్తామని తెలిపారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం అని వివరించారు. త్యాగాలు, పోరాటాలు గుర్తుకువస్తాయని చెప్పారు. అవి గుర్తుకు వచ్చేలా తెలంగాణ అధికారిక చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందెశ్రీకే అప్పగించామని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి వివరిస్తూ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారని, పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇంకా సమీక్షించలేదని చెప్పారు. తమ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని, అలాంటి చీప్ పనులు తాను చేయలేనని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. అలాగే, కేసీ వేణుగోపాల్‌ను కలిసి వేడుకలకు రావాలని ఆహ్వానించారు. ఇటు, తుగ్లక్ రోడ్డు 23లో సీఎం అధికారిక నివాస నిర్మాణ పనులను పరిశీలించారు.