– మెజారిటీ సీట్లు గెలవాల్సిందే
– మెదక్ సీటు మనదేనన్న సీఎం
– కలిసి పనిచేయాలని నేతలకు సూచన
– సమన్వయమే విజయ మంత్రమన్న రేవంత్
Cm Revanth Reddy Review On Lok Sabha Elections And Medak Seat: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 సీట్లలో 14 స్థానాలను గెలిచి తీరాలని, దీనికోసం ప్రతి నాయకుడూ కష్టపడి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల డీసీసీలు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చారు. నేతలంతా వ్యక్తిగత విభేదాలు పక్కకు పెట్టి, పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. పలు సర్వేలు, సామాజిక సమతుల్యతలను దృష్టిలో పెట్టుకుని అధిష్ఠానం టిక్కెట్లు ప్రకటించిందని, తమ స్థానంలోని అభ్యర్ధులందరినీ గెలిపించాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్న ప్రతి నాయకుడి మీద ఉందని పేర్కొన్నారు.
జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలంతా పూర్తిస్థాయి సమన్వయంతో పనిచేయాలని, చిన్న నిర్లక్ష్యం కూడా ఫలితం మీద ప్రభావం చూపే ప్రమాదం ఉందని, ఇది ప్రతిపక్షాలకు బలం చేకూర్చుతుందని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలందికీ తమ స్థాయికి, గౌరవానికి తగిన పదవులు ఇప్పించే బాధ్యత తనదేనని ఆయన నేతలకు హామీ ఇచ్చారు. మెజార్టీ లోక్ సభ సీట్లు గెలిస్తేనే, రాష్ట్రానికి మేలు జరుగుతుందని, నేతలెవరూ వ్యక్తిగత ఇగోలకు పోయి, అభ్యర్ధులను ఆగం చేయొద్దని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిసీట్లలో సమన్వయలోపంతో కొంత నష్టం జరిగిందని, అది రిపీట్ కాకూడదని అన్నారు.
Also Read :కాళేశ్వరం దోషులెవరో తేల్చడానికి విచారణ కమిషన్ ఏర్పాటు
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను అన్ని జిల్లాల్లో తాను పర్యటిస్తానని, కాంగ్రెస్ పార్టీపై ప్రజల మద్ధతు పెరిగేందుకు మరింత చొరవ తీసుకుందామన్నారు. ప్రచార ప్రణాళికలు తయారవుతున్నాయన్నాయని, క్షేత్రస్థాయి నేతలు, జిల్లా నేతలు సమన్వయంతో పనిచేస్తేనే, ఎలాంటి నష్టాలు ఉండవన్నారు. కార్యకర్తల మద్దతుతోనే విజయం సాధించగలమని హితబోధ చేశారు. పదేళ్ల పాటు ఎన్నో కష్టాలు పొంది పవర్‌లోకి వచ్చామని, ఇప్పుడు ఇగోలకు పోయి దాన్ని చేజార్చుకోరాదని, పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయ పరచుకుంటూ ముందుకు సాగుతున్న వేళ ఈ ఎన్నికల ఫలితాలు కీలకమని అభిప్రాయపడ్డారు.
మెదక్ ఎంపీ సీట్ గెలిచి కేసీఆర్‌కు ఝలక్ ఇవ్వాలని మెదక్ ఎంపీ సీటు పరిధిలోని నేతలకు సీఎం పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు అక్కడ ఒక్క ఎమ్మెల్యే సీటే ఉన్నా, ప్రజాబలంతో దాన్ని గెలవబోతున్నామని చెప్పుకొచ్చారు. ప్రతి ప్రాంతాన్నీ కవర్ చేయాలని, గతంలో తాను మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే పద్ధతిని పాటించానని వెల్లడించారు. కేసీఆర్ సెంటిమెంట్‌గా భావించే మెదక్‌లో కాంగ్రెస్ ఎగిరితేనే, కార్యకర్తల ఆశయాలకు అర్ధం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహా, కాంగ్రెస్ నాయకులు నిర్మల, మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ అభ్యర్ధి నీలం మధు ముదిరాజ్, నర్సారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పూజల హరిక్రిష్ణ, మైనంపల్లి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.