CM Revanth Review: దక్షిణ భారతంలో రెండో అతిపెద్ద ఐటీ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఐటీ కారిడార్ గణనీయంగా అభివృద్ధి చెందింది. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ఇండస్ట్రియల్ కారిడార్‌ను కూడా దీటుగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువైపుగా అడుగులు పడుతున్నాయి. ఈ దిశగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పరిశ్రమల శాఖపై సమీక్ష చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు సంబంధించి ముఖ్య అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విధానాలు రూపొందించాలని ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇందుకు అవసరమైన నూతన విధానాలపై సూచనలు చేశారు.
పరిశ్రమల శాఖపై గతంలో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే కార్మికుల సంక్షేమానికీ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టెక్స్‌టైల్స్‌కు సంబంధించి రాష్ట్రంలోని పవర్‌లూమ్, హ్యాండ్‌లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని సూచనలు చేశారు.
కాగా, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి తాము కొత్తగా ఆరు పాలసీలను రూపొందిచనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డికి భేటీలో పాల్గొన్న అధికారులు తెలియజేశారు. ఎంఎస్ఎంఈ పాలసీ, ఎక్స్‌పోర్ట్ పాలసీ, న్యూ లైఫ్‌సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేస్తూనే ఈ కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తి స్థాయిలో రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన విధానాలను అధ్యయనం చేసి ఈ పాలసీలను రూపొందించాలని సూచించారు.