Revanth Reddy: ఈ లోక్ సభ ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. జాగ్రత్తగా వ్యూహాలు రచిస్తున్నది. అసంతృప్త నాయకులనూ కలుపుకుని వెళ్లేలా, క్షేత్రస్థాయిలో ముఖ్య నాయకుల కృషిని ఉపయోగించుకునేలా అడుగులు వేస్తున్నది. సిట్టింగ్ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుకోవాలని పట్టుదలగా ఉన్నది. ఇతర చోట్లా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ప్లాన్ వేస్తున్నది. అందుకు తగిన కార్యచరణను రూపొందించుకుని ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి పార్లమెంటు స్థాయి సమావేశాన్ని తాజాగా నిర్వహించారు.
హైదరాబాద్‌లోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్లమెంటు పరిధిలోని ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. టికెట్ ఆశించిన అసంతృప్త నాయకులతో సమన్వయంతో ముందుకు సాగతాలని సూచించారు. సిట్టింగ్ స్థానాన్ని కచ్చితంగా నిలుపుకోవాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పని చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ రావాలని నిర్దేశించారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.
Also Read: టికెట్ బీజేపీది.. కానీ ఆయనకు చంద్రబాబే దేవుడు!
భువనగిరి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. గత లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో ఆయన ఈ స్థానానికి రాజీనామా చేశారు. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా ఈ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఈ స్థానంపై గట్టిపట్టు ఉన్నది. ఈ నేపథ్యంలోనే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ అప్పగించింది. ఈ లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను ఆదేశించారు.
భువనగిరిలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్: రాజగోపాల్ రెడ్డి
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసిన తర్వాత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికపై సమీక్షా సమావేశం జరిగిందని వివరించారు. తనకు ఈ నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలను పార్టీ అప్పగించినట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో.. పార్టీ ప్రచారం ఎలా ఉండాలనేది డిసైడ్ చేశామని పేర్కొన్నారు. తమకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారని చెప్పారు. భువనగిరిలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందని అన్నారు. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా పార్టీ ప్రకటించిందని, ఈ నెల 21వ తేదీన నామినేషన్ వేస్తున్నామని వివరించారు. నామినేషన్ పర్వానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హాజరవుతారని, భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేస్తామని తెలిపారు. పోలింగ్ వరకు కార్యకర్తలు విరామం లేకుండా.. 24 గంటలు పని చేయాలని నిర్దేశించారు. మే నెల మొదటి వారంలో చౌటుప్పల్, మిర్యాలగూడ బహిరంగ సభలకు ప్రియాంక గాంధీ హాజరువతారని అన్నారు.
Also Read: ఆలు లేదు.. చూలు లేదు..! టికెట్ లేకున్నా క్యాంపెయిన్ కోసం కసరత్తు!
అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు
భువనగిరి నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అని అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తనను సొంత తమ్ముడిగా భావించి తన గెలుపు కోసం పని చేస్తున్నారని వివరించారు. భువనగిరి ప్రజలు తనను వారి కుటుంబ సభ్యుడిగా భావించి ఓటు వేయాలని కోరారు. తాను భువనగిరి సమస్యల మీద పార్లమెంటులో గళం వినిపిస్తారని హామీ ఇచ్చారు.