తెలంగాణ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై విలేఖరులతో మాట్లాడారు. దావోస్ పర్యటనతో 1 లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులను పెట్టేలా మన రాష్ట్రం ఆకర్షించగలిగింది అని సీఎం వివరించారు. మా విజయాలలో ఇది అత్యంత కీలక విజయం అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, హైదరాబాద్ నగరంలో పెట్టుబడుల మీద అపోహలు , అనుమానాలు సృష్టిస్తూ వాళ అనుచరులతో, వారి దగ్గర ఉన్న నిధులతో విష ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ ఆర్ధిక మూలాలను దెబ్బతీయాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టడం ద్వారా దిగ్గజ పారిశ్రామికవేత్తలు తెలంగాణ మీద విశ్వాసంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల ద్వారా వారి కుట్రలు, పటాపంచలు అయ్యాయి అని అన్నారు. రాజకీయంగా విభేదించినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లకుండా విధానాలను మేము కొనసాగించడం వల్లే మాపై నమ్మకంతో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందు వచ్చాయని సీఎం వివరించారు.
సింగపూర్లోని ITE తో స్కిల్ యూనివర్సిటీ కోసం ఒప్పందం చేసుకోవడం జరిగింది అని సీఎం రేవంత్ తెలిపారు. ఇది భవిష్యత్ లో మన సాంకేతికను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది అన్నారు. ఈ ఒప్పందంలో సాంకేతిక నైపుణ్యం ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది అని చెప్పారు. పెట్టుబడులకు అవసరమైన భూ కేటాయింపులు చేసి అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహిస్తామని అన్నారు. మనందరం కలిసి కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఎంపీ అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.