CM Revanth Reddy Meet The Press Program: గత శాసనసభ ఎన్నికల్లో స్వేచ్ఛను ఆకాంక్షించిన తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని, వారి ఆశలు, ఆకాంక్షలను నిజం చేసేందుకే తాము రోజుకు 18 గంటలు పనిచేస్తూ బాధ్యతతో పాలన అందిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం రాజధానిలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాడు నిరంకుశ నిజాంను తరిమికొట్టిన తెలంగాణ సమాజమే గత ఎన్నికల వేళ బూర్జువా పోకడను ప్రదర్శించిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన వివరాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.
ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును హేళన చేస్తూ, పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని మాట్లాడుతున్నారని, ఆ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 సీట్లున్న బీజేపీ, 39 సీట్లున్న బీఆర్ఎస్.. ఏ విధంగా మా ప్రభుత్వాన్ని పడగొడతాయో చెప్పాలని నిలదీశారు. గత 100 రోజులుగా బాధ్యతగల సీఎంగా పనిచేశానని, నిన్నటి ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత పాలనంతా అధికారుల చేతిలోకి పోయిందని, ఇక తాను అసలు సిసలు రాజకీయ నాయకుడిగా పనిచేస్తానన్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని, దానిని రాజకీయంగా ఎదుర్కొంటామని, కాంగ్రెస్ ఒక్కసారి గేట్ ఓపెన్ చేస్తే, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ తప్ప ఇంకెవరూ మిగలరని హెచ్చరించారు.
Read More:ఎమ్మెల్సీ కవితకి బిగ్ షాక్, 7 రోజుల కస్టడీ
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధర్నాచౌక్ పునరుద్ధరణ జరిగిందనీ, నాడు దాని అవసరమే లేదన్న బీఆర్‌ఎస్ నేతలకూ నేడు అక్కడ చోటు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించామని, సచివాలయంలోకి పాత్రికేయులు, ప్రజలు గర్వంగా ప్రవేశించేలా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం గుర్తుచేశారు. అధికారాన్ని కొద్ది మంది చేతిలో పెట్టకుండా అధికారులందరికీ పాలనలో స్వేచ్ఛను కల్పించి పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని వివరించారు. తెలంగాణ సంస్కృతిని మరుగున పరచేందుకు గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు చరమగీతం పాడి ‘జయజయహే తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా మార్చటమే గాక తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులకు చొరవ చూపామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు హామీల అమలు చేశామని, గృహజ్యోతి కింద జీరో కరెంటు బిల్లులు, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించే పనిలో ఉన్నామన్నారు. నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లకు రంగం సిద్ధమైందన్నారు. కరెంటు అంశంపై మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరి కమిషన్(ఈఆర్సీ)లో కేసీఆర్ నాటిన గంజాయి మొక్క ఒకటి గృహజ్యోతి డబ్బులు ముందే డిస్కంలకు ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిందనీ, ప్రజాద్రోహులైన అలాంటి గంజాయి మొక్కలు ఏరి పారేస్తానని హెచ్చరించారు.
బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు ప్రస్తావన మీద స్పందిస్తూ.. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరతారని తాను అనుకోవడం లేదని, ఆయన పట్ల తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. నిజంగా ప్రవీణ్ పోలీసు శాఖలో ఉంటే డీజీపీ అయ్యేవారనీ, కానీ పేద విద్యార్థులకు ఏదో చేయాలనే తపనతో గురుకులాల్లో పనిచేసేందుకు వెళ్లిపోయారన్నారు. తాను ఆయనకు TSPSC ఛైర్మన్ ఆఫర్ ఇచ్చానని, కానీ ప్రవీణ్ దానిని సున్నితంగా తిరస్కరించారన్నారు. ఒకవేళ ప్రవీణ్ గులాబీ కండువా కప్పుకుంటే దానికి కారణమేంటో ఆయనే వివరించాలన్నారు. బతుకమ్మ పండుగను కొందరు వ్యాపార వస్తువుగా మార్చారని సీఎం రేవంత్ ఫైరయ్యారు. బతుకమ్మ, బోనాలు తెలంగాణ సమాజం అనాదిగా జరపుకుంటున్నవేనని, వ్యక్తులతో నిమిత్తం లేకుండా ఆ పండుగలు ఎప్పటికీ కొనసాగుతాయని అన్నారు. ప్రైవేట్ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించామన్నారు. ధరణి పోర్టల్ ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే అసలు విషయం బయటపడుతుందని పేర్కొ్న్నారు.
Read More:ఎకో టూరిజాన్ని డెవలప్ చేద్దాం: సీఎం
ఈ రోజు తెలంగాణ నెత్తిన రూ.9 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.6 వేల కోట్లుగా ఉండగా, కేసీఆర్ నిర్వాకంతో ప్రస్తుతం ఏటా రూ.64 వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. అయినా, పొదుపును పాటిస్తూ, ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇంత ఇబ్బందికర పరిస్థితిలోనూ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు అందించామని గుర్తుచేశారు. తాము పాలకులుగా గాక సేవకులుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని, వైబ్రెంట్ తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.