– తుక్కుగూడ సభ వివరాలు వెల్లడించిన సీఎం
– గత పదేళ్లలో వందేళ్ల విధ్యంసం
– కేసీఆర్ ‘కాల’జ్ఞానం ఏమైందో..
– ఎన్నికల్లో విజయంపై ధీమా
CM Revanth Reddy Inspected The Arrangements Of Tukkuguda Public Meeting: పదేళ్ల కేసీఆర్ పాలన తెలంగాణకు వందేళ్ల విధ్వంసాన్ని మిగిల్చిందనీ, నాటి బీఆర్ఎస్ నేతలు తెలంగాణ వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుతిన్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 6న కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డితో కలిసి పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితర నేతలు తుక్కుగూడ సభలో విడుదల చేయనున్నారని సీఎం తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి దేశ ప్రజలకు ఇచ్చే హామీలతో కూడిన మేనిఫెస్టో తెలంగాణలో విడుదల కావటాన్ని గొప్ప గౌరవంగా అభివర్ణించారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే తెలంగాణకు ఇచ్చే ప్రత్యేక నిధులు, తదితర వివరాలను మేనిఫెస్టోలో పొందుపరచారని వెల్లడించారు. కాంగ్రెస్ పాలనతోనే రాష్ట్రంలో కరవు వచ్చిందంటూ ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం మండిపడ్డారు. 80 వేల పుస్తకాలు చదివిన ఆయనకు వర్షాకాలం, చలికాలం ఎప్పుడొస్తుందో కూడా తెలియదా?అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు పదేళ్ల తర్వాతైనా రైతులు, వ్యవసాయం గుర్తొచ్చినందుకు, ఇప్పటికైనా పొలం బాట పట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి సంతోషంగా ఉందని తెలిపారు.
Read Also: ఇంతకీ ఏమంటారు..?
వచ్చే లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ కంచుకోట అని నిరూపించబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. తుక్కుగూడలో జరిగే సభలో మహిళలకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేస్తామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలను తెలంగాణలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ఎన్నికల కోడ్ రావడంతో పథకాల అమలు కాస్త ఆలస్యమైందని, ఎన్నికల అనంతరం అర్హులైన ప్రతి ఒక్క లబ్దిదారుకు పథకాలు అందిస్తామన్నారు.