హైదరాబాద్, స్వేచ్ఛ: ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫలితాల్లో పాలమూరుకు చెందిన అనన్య రెడ్డి జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను అభినందించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది అనన్య. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన రేవంత్ రెడ్డి, శాలువా కప్పి సన్మానించారు. అనన్య సొంత ఊరు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నగల్. కానీ, చాలా ఏళ్ల క్రితమే మహబూబ్ నగర్ టౌన్‌లో స్థిరపడింది ఆమె కుటుంబం. అనన్య ఇంటర్ పూర్తయ్యాక ఢిల్లీలోని మిరిండా హౌస్ కాలేజీలో బీఏలో చేరింది. 2020 నుంచి పూర్తిస్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్స్ ప్రారంభించింది.
Also Read: కాంగ్రెస్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు.. ‘బీజేపీని నిలువరించడమే లక్ష్యం’
ఇంటర్ నుంచే ఆమె ఐఏఎస్ వైపు ఆకర్షితురాలైంది. అటువైపుగా అడుగులు వేసింది. ఇందులో భాగంగానే ఆమె హైదరాబాద్‌లోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో చేరింది. ఢిల్లీలో పీజీ చదువుతూనే సివిల్స్ పరీక్షలకు సిద్ధమైంది. సివిల్స్‌లో ఆప్షనల్ సబ్జెక్టుగా ఆంత్రపాలజీని ఆమె ఎంచుకుంది. ఆ తర్వాత ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఫస్ట్ ప్రయత్నంలోనే విజయాన్ని అందుకుంది.