Telangana cabinet meeting news(Telangana news today):
ఈ నెల 18వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. వచ్చే నెల 2వ తేదీతో తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు నిండుతున్న నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టనున్నారు. ఈ అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే, రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ చేయనున్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు.. ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి పెండింగ్ ఉన్న అంశాలు అన్నింటిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. షెడ్యూల 9, 10ల్లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అలాగే.. పలు అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. విద్యుత్ సంస్థల బకాయిలూ తేలలేదు. వీటి పరిష్కారం వైపుగా ఇది వరకు జరిగిన ప్రయత్నాలనూ తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నష్టపోకుండా ఎంచుకోవాల్సిన దారిపై చర్చించనున్నారు.
Also Read: ఏమి కాన్ఫిడెన్సు బాసు.. రేపటి నుంచి ఎంపీగా పని ప్రారంభిస్తానంటున్న కేఏ పాల్
ఉభయ రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునే వీలున్న ఉద్యోగుల బదిలీ వంటి అంశాలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇక పీఠముడి పడిన అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేలా తదుపరి కార్యచరణపై కేబినెట్‌లో చర్చిస్తారు.
విభజన జరిగిన పదేళ్లు పూర్తికావడంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇక మీదట తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారుతుంది. ఇక్కడ ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలు జూన్ 2వ తేదీ తర్వాత తెలంగాణ ప్రభుత్వ అధీనంలోకి వస్తాయి.