– భారీ వర్షాల సూచనలు ఉన్నందున అప్రమత్తం
– ఏ ఆపద వచ్చినా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి
– అన్నదాతలకు ఆందోళన వద్దు
– తడిచిన ధాన్యం కొనుగోలుకు అధికారులకు సూచన
– పలు జిల్లాల్లో గాలివాన వల్ల కలిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
Telangana Elections: ఎన్నికలకు ఒక రోజు ముందు వరణుడు బీభత్సం సృష్టించాడు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పిడుగులు కూడా పడ్డాయి. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అలర్ట్ య్యారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి సహా పలు జిల్లాల్లో గాలివాన, పిడుగుల వల్ల కలిగిన నష్టంపై ఆరా తీశారు. మరిన్ని రోజులు వర్షాలు కురుస్తాయన్న సూచనలు రావడం, మరో వైపు పోలింగ్ జరగనుండటంతో జిల్లాల కలెక్టర్లు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఆపద తలెత్తినా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఆదివారం కురిసిన భారీ వర్షానికి పిడుగులు కూడా తోడయ్యాయి. మెదక్ జిల్లా శంకరంపేట మండలంలో పిడుగుపడి ఇద్దరు మరణించారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటనలపై సీఎం స్పందిస్తూ.. మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఆదిలాబాద్‌లో పిడుగుపాటుకు గాయపడ్డ వారికి తగిన వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని సీఎం తెలిపారు. ఎక్కడైనా వర్షాలకు ధాన్యం తడిస్తే.. తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.
Also Read: మందు బాబులకు మరో షాక్.. వైన్స్ ఓపెనింగ్ అప్పుడేనంటా
ఇదిలా ఉండగా.. ఎన్నికలు సజావుగా సాగేలా అధికారులు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జీ నిరంజన్ విజ్ఞప్తి చేశారు. వర్షాల వల్ల ఎన్నికల సిబ్బంది ప్రయాణం ఇబ్బందిగా మారిందని, ఎన్నికల పరికరాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది సాఫీగా ప్రయాణం సాగించేలా, ఎన్నికల సిబ్బందికి ముప్పు జరగకుండా పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బందిని వెంటనే రంగంలోకి దింపేలా అప్రమత్తం చేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లోకి వరద నీరు చేరకుండా సంబంధిత అధికారులను ఆదేశించాలని ఓ లేఖలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని, కానీ, వాతావరణం అనూహ్యంగా మారడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని, తద్వార పోలింగ్ సిబ్బంది, ఓటర్లు, ఈవీఎంల భద్రతను చూసుకునేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సి వస్తున్నదని తెలిపారు.