Yadadri Temple Darshan : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట, భద్రాద్రి జిల్లాల్లో పర్యటించారు. ముందుగా యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సతీ సమేతంగా ఆలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు. అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు.
దీంతో యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. సతీసమేతంగా సీఎం ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. వారితోపాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. సీఎంను మర్యాదపూర్వకంగా సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని తీర్థ, ప్రసాదాలను అందిజేశారు అర్చకులు.
Read More: వార్’గల్లు వన్‌సైడ్
అనంతరం రోడ్డు మార్గంలో భద్రాచలానికి బయల్దేరి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భద్రాచలం వెళ్లారు రేవంత్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో ఎండోమెంట్ కమిషనర్, ఈవో, అర్చకులు స్వాగతం పలికారు.
స్వామివారికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేదాశీర్వచనం పలికారు. తర్వాత భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష జరిపారు రేవంత్ రెడ్డి. సీఎం వెంట మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఉన్నారు. ఈ సమీక్ష అనంతరం మార్కెట్ యార్డులో 5వేల మంది మహిళల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు.