CM Jagan: సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఏకంగా రాష్ట్రాలను ఏలిన చరిత్ర ఉన్నది. కానీ, ఆ తర్వాత రాజకీయ క్షేత్రంలో సినీతారల సందడి తగ్గిపోయిందనే చెప్పాలి. పలువురు టికెట్లు ఆశించి భంగపడ్డవారు కూడా ఉన్నారు. ఇందులో ప్రముఖంగా అలీ పేరు వినిపిస్తున్నది. ఫిల్మ్ యాక్టర్, కమెడియన్ అలీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయాలనీ ఉవ్విళ్లూరారు. తొలుత టీడీపీకి, ఆ తర్వాత జనసేనకు, చివరికి వైసీపీలో చేరారు. కానీ, ఆయనకు ఏ పార్టీలోనూ టికెట్ దక్కలేదు.
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున అలీ ప్రచారం చేశారు. అప్పుడు వైసీపీ ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత కూడా అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో కనిపించారు. ఈ సారి అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ అలీ పేరు పరిశీలనలో ఉన్నదనే టాక్ వినిపించింది. ముస్లింలు మెజార్టీగా ఉన్న స్థానం నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం వచ్చింది. గుంటూరు ఈస్ట్ నుంచి ఆయన పేరు బలంగా వినిపించింది. కానీ, ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటనల జాబితాలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిలో ఉన్న అలీ పేరు ఎక్కడా కనిపించలేదు. అప్పటి నుంచి అలీ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్టీ కోసం పని చేసిన అలీని జగన్ విస్మరించారా? అనే విమర్శలు వినిపించాయి.
Also Read: సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
పోసాని కృష్ణమురళీ కూడా చాలా రాజకీయ విషయాలపై ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. ఆయననూ ఎన్నికల్లో అభ్యర్థిగా వైసీపీ పరిగణనలోకి తీసుకోలేదు. కానీ, అలీ తరహాలో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని పోటీకి ఆసక్తిని ఎక్కడా వ్యక్తపరచలేదు. జనసేనలో చేరిన పృథ్వీరాజ్‌కు కూడా టికెట్ దక్కలేదు. ఇక ఇటీవలే నిఖిల్ టీడీపీలో చేరినా ప్రచారానికి పరిమితం కానున్నారు. హైపర్ అది పరిస్థితీ ఇంచుమించు ఇంతే.
ఇక సీనియర్ల విషయానికి వస్తే ఏపీలో రాజకీయ పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఈ ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. బాలకృష్ణ, రోజా ఎప్పటిలాగే మళ్లీ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. తెలంగాణలో విజయశాంతి, జయసుధలో రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నా.. ఎన్నికల హీట్‌లోనూ వారి హడావిడి కనిపించడం లేదు. బాబు మోహన్ అనూహ్యంగా ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకుని అసెంబ్లీ బరిలో ఉన్నారు.
Also Read: ఆర్జీవీ డైలాగ్ కాపీ కొడుతున్న తెలుగు ముఖ్యమంత్రులు జగన్, రేవంత్ రెడ్డి
ఒకప్పుడు ఎన్నికల ప్రచారాల్లో సినీ తారలు తళుక్కుమనేవారు. ఎలక్షన్ క్యాంపెయిన్‌కు వాళ్లు సినీ గ్లామర్‌ను అద్దేవారు. రాజకీయ పరిణామాలు, రాజకీయ పార్టీలపైనా ఫిల్మ్ స్టార్స్ తమ అభిప్రాయాలు బహిరంగంగా వెల్లడించేవారు. కానీ, రాను రాను ఇలాంటి పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. ఈ ఎన్నికల్లో సినీ తారలు దాదాపుగా ఎక్కడా కనిపించడం లేదు. అధికారంలో పార్టీలు మారితే తమ సినిమాలకు ఆటంకాలు ఎదురవుతాయేమోననే ఆందోళన సినీతారలను నోరుమెదపనివ్వడం లేదని అంటున్నారు. ఇటు తెలంగాణలో.. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా లేదా సోషల్ మీడియా, మీడియా ముఖంగానూ సినిమా తారలు పెద్దగా కనిపించడం లేదు.