Hasanparthi: శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రజలపైనే ప్రతాపం చూపిస్తున్నారు. రక్షణ కల్పించాలని మొరపెట్టుకుంటే జులుం చూపిస్తూ రెచ్చిపోతున్నారు. బాధితులనే చితకబాదుతున్నారు. పక్షపాతంగా వ్యవహరిస్తూ న్యాయాన్ని పాతిపెడుతున్నారు. హనుమకొండలో ప్రశాంత్‌కు జరిగిన అనుభవం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నది.
హనుమకొండలో ప్రశాంత్ అనే వ్యక్తి పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యే శరణ్యం అని అనుకున్నాడు. సూసైడ్ నోట్ రాసి వ్యక్తి కనిపించకుండాపోయాడు. తన చావుకు హసన్‌పర్తి సీఐ, ఎస్‌ఐలే కారణం అని ఆరోపించాడు. ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అనేది ప్రస్తుతానికి తెలియదు. దీంతో ప్రశాంత్ భార్య శ్యామల తీవ్ర ఆందోళనకు గురైంది. వరంగల్ సీపీని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. తన భర్తను వేధించిన పోలీసు అధికారులపై సీపీకి ఫిర్యాదు చేసింది. ఆ పోలీసులపై యాక్షన్ తీసుకోవాలని కోరింది. హసన్‌పర్తి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: తగ్గేదే లే!.. గుజరాత్ ఆధిపత్యాన్ని నిలదీస్తాం
బాధితుడి భార్య శ్యామల, ఫిర్యాదు ప్రకారం, ప్రశాంత్ అనే వ్యక్తి కొందరికి అప్పుగా డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇచ్చేయాలని కోరితే వారు ప్రశాంత్‌నే వేధించారు. దీంతో ప్రశాంత్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తనకు అండగా నిలబడతారని అనుకున్నాడు. డబ్బులు తీసుకుని తనపై దౌర్జన్యం చేస్తున్నవారి ఆటలు కట్టడి చేస్తారని భావించాడు. పోలీసులు తనకు అండగా నిలబడాల్సింది పోయి తననే విచక్షణారహితంగా కొట్టారు. దీంతో పోలీసు టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. పోలీసుల టార్చర్ వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆయన భార్య శ్యామల ఆందోళన వ్యక్తం చేసింది. తన భర్తను కాపాడాలని, హసన్‌పర్తి పోలీసులపై యాక్షన్ తీసుకోవాలని వరంగల్ సీపీకి ఫిర్యాదు చేశానని వివరించింది.
సీపీ ఆదేశాలతో మిస్సింగ్ కేసు ఫైల్ అయింది. ఈ కేసులో పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రశాంత్ ఆరోపణలు నిజం కాదని పోలీసులు ఖండిస్తున్నారు. హసన్‌పర్తి పోలీసులపై ప్రశాంత్ కుటుంబ సభ్యులు, స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.