– ఇతర రాష్ట్రాల్లో కిడ్నాప్‌లు
– హైదరాబాద్ అడ్డాగా విక్రయాలు
– గుట్టుచప్పుడు కాకుండా పిల్లల్ని అమ్మేస్తున్న ముఠా
– పసిగట్టిన మేడిపల్లి పోలీసులు
– స్పెషల్ ఆపరేషన్‌తో 16 మంది పిల్లలు సేఫ్
Children: ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మడానికి లేదు. ఓవైపు చిన్నా పెద్దా తేడా లేకుండా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంకోవైపు కిడ్నాప్ ముఠాలు కాచుకుని ఉంటున్నాయి. పిల్లల్ని సింగిల్‌గా బయటకు పంపలేని పరిస్థితి. ఎటునుంచి ఎవరు వచ్చి ఏం చేస్తారో అనే భయం వెంటాడుతోంది తల్లిదండ్రులకు. తాజాగా మేడిపల్లి ఘటనతో ఆ భయం మరింత పెరిగింది.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ శివారులోని మేడిపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా పిల్లల్ని విక్రయిస్తోంది ముఠా. ఈ విషయం పసిగట్టారు పోలీసులు. ఎలాగైనా ముఠాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్పెషల్ ఆపరేషన్‌కు ప్లాన్ చేశారు. ప్లాన్ పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడంతో పిల్లల్ని అమ్మేస్తున్న ముఠా దొరికిపోయింది. వారి నుంచి 16 మంది పిల్లల్ని కాపాడారు పోలీసులు. ఇతర రాష్ట్రాల్లోని పేద పిల్లల్ని కిడ్నాప్ చేసి, తెలంగాణకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, నెల రోజుల వయసున్న చిన్నారులు కూడా వీరి దగ్గర ఉండడం అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది.
8 మంది అరెస్ట్
ఈ ఘటనపై రాచకొండ సీపీ తరుణ్ జోషి మీడియాకు వివరాలు వెల్లడించారు. రాచకొండ పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ముఠా పట్టుబడిందని, నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. పిల్లలు లేని వారికి ఈ పిల్లలను ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్టుగా తెలిపారు. ఇటీవల మేడిపల్లిలో శోభా రాణి, సలీం, స్వప్నలను అరెస్ట్ చేశామని, ఆ సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించామన్నారు. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా, ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను గుర్తించినట్టు చెప్పారు. మొత్తం 8 మందిని అరెస్టు చేశామన్నారు సీపీ. ఢిల్లీ, పూణెల నుంచి చిన్నారులను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు గుర్తించామని, ఈ కేసులో మొత్తం 16మంది చిన్నారులను కాపాడినట్టు వివరించారు. ఢిల్లీ, పూణెలో ఉన్నవారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్ వెళ్ళిందని తరున్ జోషి తెలిపారు.
పిల్లల్ని కొని పెంచుకోవచ్చా.. చైల్డ్ వెల్ఫేర్‌తో మాట్లాడిన ‘స్వేచ్ఛ’
మేడిపల్లి ఘటన నేపథ్యంలో మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రాజారెడ్డితో ‘స్వేచ్ఛ’ మాట్లాడింది. ఈ సందర్భంగా ఆయన కీలక వివరాలు వెల్లడించారు. పిల్లలను కొనుగోలు చేసి పెంచుకోవడం నేరమని, మేడిపల్లిలో జరిగిన ఘటన చట్ట వ్యతిరేకంగా జరిగిందని తెలిపారు. శిశు విహార్‌కు 11 మంది పిల్లలను రిస్క్ చేసి అప్పగించారని వివరించారు. వారి బాగోగులు చూడడానికి అక్కడ తగిన సిబ్బంది ఉన్నట్టు చెప్పారు. శిశు విహార్‌లో ఆరు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారని, పిల్లలను దత్తత తీసుకోవాలనుకున్న వారు వెబ్ సైట్‌లో అప్లై చేసుకోవాలని తెలిపారు. అధికారులు ఫీల్డ్ లెవల్‌లో ఎంక్వైరీ చేసి కలెక్టర్ ఆర్డర్స్ ద్వారా దత్తతకు ఇస్తారని చెప్పారు. ఈ ప్రాసెస్ సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు పడుతుందని వివరించారు. అక్రమ మార్గాల్లో పిల్లల్ని పొందడం వల్ల చిక్కులు ఏర్పడతాయని స్పష్టం చేశారు మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రాజారెడ్డి.