Chandrababu Nitish Be Careful With Modi Policies In Future: పద్దెనిమిదవ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దేశ ప్రజలను ఊహించిన దానికంటే ఎక్కువ ఆశ్చర్యంలో ముంచాయి. ఈసారి సొంతగా 370 సీట్లు సాధిస్తామని బీరాలు పోయిన బీజేపీ 240 సీట్లకే పరిమితం కాగా, ఎన్డీయే కూటమిగా 292 సీట్లకే పరిమితమైంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఈసారి ఓటర్లు బీజేపీని మెజారిటీకి 32 స్థానాల దూరంలోనే ఉంచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సొంతగా 303 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ ఏకంగా 63 స్థానాలు తగ్గి 240కే పరిమితమైంది. కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన మొదలయ్యాక తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ భాగస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితిలో పడింది. మరోవైపు, 2019లో 52 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో తన బలాన్ని వందకు పెంచుకోగా, కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి 234 సీట్లు సాధించి దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
రాజకీయ నాయకుడిగా గతంలో నరేంద్రమోదీ ఏనాడూ సంకీర్ణాలను నడపలేదు. గుజరాత్ సీఎంగా ఆయన 2001 – 2014 పనిచేసిన కాలంలోనే గాక 2014 – 2024 మధ్యకాలంలోనూ బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వాలనే ఆయన నడిపారు. తాజా ఎన్నికలలో ఓటర్లు ఆయనకు గతంలో ఎన్నడూ పోషించని కొత్త పాత్రను అప్పగించారు. పైగా, ఈసారి ఆయన సంకీర్ణ ప్రభుత్వానికి అవసరమైన దానికంటే కేవలం 21 సీట్లు మాత్రమే అధికంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో మోదీ ఎక్కువగా ఆధారపడుతున్న రెండు మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ పార్టీలకు 28 సీట్లున్నాయి. ఈ రెండూ ఏపీ, బీహార్‌లో ప్రబలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలను నడిపించే నాయకులు ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉండటమే గాక, తెలివైన వారిగానూ గుర్తింపు పొందినవారే. పైగా వీరిద్దరూ రాజకీయంగానూ మోదీ కంటే సీనియర్లు. అంతేకాదు.. వీరిద్దరూ గతంలో బీజేపీతో కలిసి పనిచేసి, నచ్చక కాంగ్రెస్‌తో చేతులు కలిపినవారే. కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించిన అనుభవమూ ఈ ఇద్దరికి ఉంది. అయితే, చంద్రబాబుతో పోల్చితే నితీష్ కుమార్‌కు కొన్ని పరిమితులున్నాయి. నితీష్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగటానికి బీజేపీ మద్దతు తప్పనిసరి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడికి అసెంబ్లీలో అఖండమైన మెజారిటీ ఉంది. వీరిలో మోదీ, నితీష్‌లు సమ వయస్కులు కాగా, మోదీ కంటే చంద్రబాబు వయసులో పెద్దవారు. తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి మోదీ ప్రత్యక్ష రాజకీయాల్లోనే లేరు. మోదీ 1971లో ఆర్ఎస్ఎస్‌లో చేరినప్పటికీ 1985 నుంచే భారతీయ జనతా పార్టీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు. అదే 1971 నాటికి చంద్రబాబు యూత్ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. బాబు ఎమ్మెల్యే అయ్యేనాటికీ మోదీ ఆర్ఎస్ఎస్‌లో ప్రచారక్ మాత్రమే. చంద్రబాబు 1995లో సీఎం కాగా, 2001లో మోదీ గుజరాత్ సీఎం అయ్యారు. నిరంతరం ప్రజల దృష్టిని ఆకర్షించాలనుకునే వ్యక్తిగా పేరొందిన మోదీ ఈ ఇద్దరు అనుభవజ్ఞులైన, ప్రగతి శీల భావాలున్న బలమైన ప్రాంతీయ నేతలతో వ్యక్తిగతంగా, పాలనా పరంగా ఎలాంటి సంబంధాలు నడుపుతారనే అంశం ఇప్పుడు అసక్తిని కలిగిస్తోంది.
Also Read: మిధ్యగా మారుతున్న ఉన్నత విద్య
ఇక.. పార్టీ పరంగా బీజేపీకి వచ్చే అక్టోబరు నాటికి జరగనున్న హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ ఎన్నికలతో బాటు తర్వాతి రెండు నెలల్లో వస్తున్న ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారబోతున్నాయి. వీటిలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోనూ బీజేపీకి బలంగా ఎదురుగాలి వీస్తోంది. హర్యానాలో 2019లో బీజేపీ పదికి పది సీట్లు గెలుచుకోగా, ఈసారి అది సగానికి పడిపోయింది. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో ఎన్డీయే 43 సీట్లు దక్కించుకోగా, ఈ ఎన్నికల్లో ఏకనాథ్ షిండే, బీజేపీ కూటమి 17 సీట్లకే పరిమితమైంది. ఈ ప్రభావం నాలుగైదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల మీద తప్పక పడనుంది. దీనికి ఇతర కారణాలూ ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినా మెజారిటీ సాధించలేక, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఏడుగురు స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మనోహర్‌లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా, జేజేపీ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తదనంతర పరిణామాల్లో ఖట్టర్ రాజీనామా, కొత్త సీఎం నేటికీ నిలదొక్కుకోలేకపోవటం, లోక్‌సభ ఎన్నికలకు ముందు సంకీర్ణం నుంచి చౌతాలా నిష్క్రమణతో ప్రభుత్వం మైనారిటీలో పడటం తలనొప్పిగా మారింది.
ఇక.. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లోనూ బీజేపీకి కనుచూపుమేరలో సవాళ్లే కనిపిస్తున్నాయి. ఇక్కడ శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ చీలిక వర్గం అజిత్ పవార్ నాయకత్వంలో నడుస్తోండగా, ఈ వర్గానికి చెందిన సీనియర్ నేత ప్రపుల్ పటేల్.. గత కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా, తాజా మంత్రి వర్గంలో ఆయనకు సహాయ మంత్రి పదవిని ఆఫర్ చేయగా అజిత్ పవార్ వర్గం మండిపడి దానిని తిరస్కరించింది. మరోవైపు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా లాభం లేకపోవటం, ఆ పొత్తు కారణంగా సొంతపార్టీ నుంచి వలసలు ప్రారంభం కావటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీతో కలిసి వస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే సమయంలో.. కేంద్రంలో సొంతగా అధికారంలోకి రాలేకపోవటంతో బీజేపీ మళ్లీ, ఉద్ధవ్ థాక్రేకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టటం, దానిపై శివసేన చీలిక వర్గం నేత, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అసంతృప్తి వ్యక్తం చేయటం బీజేపీకి తలనొప్పిగా మారింది. మరాఠా రాజకీయాలను కనుసైగతో శాసించగలడని పేరున్న శరద్ పవార్.. ఇవన్నీ మౌనంగా గమనిస్తున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాగానే.. ‘కొన్ని నెలల్లోనే మనం మహారాష్ట్ర పీఠాన్ని చేజిక్కించుకోబోతున్నాం’ అంటూ చేసిన ప్రకటన ఉద్ధవ్, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిలో ఉత్సాహాన్ని నింపగా, బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టింది. ఇదే సమయంలో బీజేపీ మార్గదర్శిగా చెప్పే ఆర్‌ఎస్ఎస్ సైతం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రతికూలంగా స్పందించింది. బీజేపీ నేతల అతి విశ్వాసం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవటం, పాలన పేరుతో కొన్ని వర్గాలను పీడించటమే ఈ ఫలితాలకు కారణమని సంఘ్ వ్యాఖ్యానించింది.
ఈ ఇబ్బంది కరమైన పరిస్థితి దృష్ట్యా.. ఈ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గంలో పెద్ద సంఖ్యలో మంత్రి పదవులు కేటాయించారు. 48 సీట్లున్న మహారాష్ట్ర నుంచి ఆరుగురు మంత్రులు కాగా, వీరిలో నలుగురు బీజేపీ వారు. షిండే వర్గానికి ఒకటి, రిపబ్లికన్ పార్టీకి మరొక మంత్రి పదవి దక్కాయి. 30 మంది ఎన్డీయే ఎంపీలను పంపిన బీహార్‌కు 8 మంత్రి పదవులు రాగా, హర్యానాకు 3, జార్ఖండ్‌కు 2, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు ఒక్కో మంత్రి పదవి దక్కాయి. ప్రధానితో కలిపి 72 మంది మంత్రులున్న కేబినెట్‌లో కేవలం ఈ 6 రాష్ట్రాలకే 21 మంత్రి పదవులు (29.3%) దక్కాయి. దీనిని బట్టే వచ్చే 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తనకెంత ముఖ్యమో బీజేపీ చెప్పకనే చెప్పినట్లయింది. ఒకవేళ ఏడాదిలోగా జరగబోయే ఈ ఎన్నికల్లో విపక్ష పార్టీల ఆధిక్యం పెరిగితే, రాజ్యసభలో ప్రభుత్వానికి ఉన్న మెజారిటీ తగ్గటం ఖాయం. ఈ పరిణామాలను ఎన్డీయేలో కీలక మిత్ర పక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేన (షిండే) వర్గాలు తమకు అనుకూలంగా మలచుకోకుండా ఉంటాయా? మిత్ర పక్షాల అభిప్రాయాలకు, ఒత్తిడికి లొంగి మోదీ పనిచేయగలరా? తాము ఆశించే ప్రయోజనాలు నెరవేరని పక్షంలో ఎన్డీయేలోని మిత్రపక్షాలు ప్రత్యామ్నాయం గురించి ఆలోచనలు చేస్తాయా? అనే ప్రశ్నలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాగే.. ఈ ఇబ్బందికరమైన పరిస్థితి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి దోహదపడుతుందని, ప్రధాని ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేసి, పాలనను వికేంద్రీకరిస్తుందని, దాని వల్ల మిత్రపక్షాలకు ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం వస్తుందని, గత పదేళ్లలో ఉక్కపోతకు గురైన మీడియా, న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, విచారణ సంస్థలు మరింత స్వతంత్రంగా మారగలవని ప్రజాస్వామిక వాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
-గోరంట్ల శివరామకృష్ణ (సీనియర్ జర్నలిస్ట్)