Central Govt’s Silence On Adani Coal Scam: కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రముఖ వ్యాపారవేత్త అదానీకి సంబంధించిన సంపద అపరిమితంగా పెరుగుతూ వస్తోంది. ఈ అసాధారణ వృద్ధి వెనక అనేక అక్రమాలు, ప్రభుత్వం చూపుతున్న ఆశ్రిత పక్షపాతం ఉన్నాయని పదేళ్లుగా విమర్శలూ ఉన్నాయి. అయితే, అదానీ బొగ్గు వ్యాపారం మీద తాజాగా లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ మంగళవారం వెలువరించిన కథనం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. తక్కువ నాణ్యత గల బొగ్గును విదేశాల నుంచి పెద్దమొత్తంలో కొని నిల్వ చేసి, దానిని ప్రభుత్వ రంగంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు అధిక ధరలకు అంటగట్టటం ద్వారా ఆయన వేల కోట్లు అక్రమంగా లబ్ది పొందారనేది ఈ కథనం సారాంశం. లోక్‌సభ ఎన్నికల వేళ తన ఆప్తమిత్రుడి అక్రమ వ్యాపార లావాదేవీలను అంతర్జాతీయ స్థాయిలో పేరున్న మీడియా సంస్థ బయటపెట్టినా, దీనిపై విచారణకు ఇండియా కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నా, పాలక పక్షం దీనిపై మౌనం వహించటం వెనక ఉన్న అంతరార్థం ఏమిటో చెప్పాలనే డిమాండ్లు నేడు దేశవ్యాప్తంగా వినవస్తున్నాయి.
2014, జనవరి మాసంలో అదానీ సంస్థ ఇండినేషియా నుంచి ఒక కిలోగ్రాముకు 3,500 కేలరీలు కలిగిన దాదాపు 69,925 మెట్రిక్ టన్నుల బొగ్గును కొనుగోలు చేసింది. ఆ బొగ్గును సముద్రమార్గం ద్వారా ఎన్నూర్ పోర్టుకు చేర్చి, దానిని తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి 6,000 కేలరీల బొగ్గుగా చూపి, ఒక్కో టన్ను బొగ్గుకు 92 డాలర్ల చొప్పున అదానీ కంపెనీ వసూలు చేసింది. అయితే, అదానీ గ్రూపు అత్యంత తక్కువ నాణ్యత గల బొగ్గును విదేశాల్లో కొని, అత్యధిక నాణ్యత గల బొగ్గుగా చూపించి లబ్ది పొందిందంటూ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరెప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు (ఓసీసీఆర్పీ) ప్రతినిధులు బయటపెట్టారు. ‘అదానీ గ్రూప్ తక్కువ గ్రేడ్ బొగ్గును విద్యుత్ తయారీ కోసం మండిస్తోంది. ఎక్కువ ఇంధనాన్ని తగలబెట్టడం గాలి నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తద్వారా బంపర్ లాభాలను పొంది ఉండవచ్చు’ అని రిపోర్ట్ పేర్కొంది. అలాగే, 2014 జనవరి నుంచి అక్టోబరు మధ్యకాలంలో తమిళనాడు తీరానికి దిగుమతి అయిన అనేక వస్తువుల్లో 24 రకాల సరుకులు అత్యంత తక్కువ నాణ్యత కలిగి ఉన్నాయని, వాటిలో అదానీ సమకూర్చిన బొగ్గు కూడా ఒకటని ఓసిసిఆర్‌పి సంస్థ తెలిపింది. ఈ బొగ్గు కొన్న ధరకు రవాణా చార్జీలు కూడా జోడించిన తర్వాత టన్ను బొగ్గు ధర మూడు రెట్లు పెరిగిందని, అదే ధరకు దానిని తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి అమ్మటం జరిగిందని, 2014 జనవరి బొగ్గు వ్యాపారపు 22 షిప్‌మెంట్‌ల డాక్యుమెంట్లు ఇదే వాస్తవాన్ని చెబుతున్నాయని ఫైనాన్షియల్ టైమ్స్ వివరించింది. ఇలా 2014-2016 మధ్య అదానీ కంపెనీ కారణంగా టీఏఎన్‌జీఈడీసీవో సంస్థకు మొత్తంగా రూ. 3 వేల కోట్ల మేర నష్టంవాటిల్లినట్టు 2018లో అరప్పూర్ అయక్కమ్ అనే ఎన్జీవో సంస్థ ఆరోపించిన విషయాన్ని ఓసీసీఆర్పీ ఈ సందర్భంగా గుర్తుచేసింది.
Also Read: ఇంకా తెగని రెండు రాష్ట్రాల పంపకాల పంచాయితీ
2021 – 2023 మధ్య కాలంలో మార్కెట్ ధర కంటే ఎక్కువకు భారత్‌లోని సంస్థలకు అమ్మేందుకు అదానీ గ్రూపు మధ్యవర్తులకే 300 కోట్ల డాలర్లు చెల్లించినట్టు కూడా ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. మరోవైపు నాశిరకం బొగ్గు వాడుతున్న విద్యుత్ కేంద్రాల చుట్టూ పర్యావరణం ఎలా ధ్వంసమవుతోందో లాన్సెట్‌లో వెలువడిన అధ్యయనం వెల్లడిస్తోంది. బొగ్గు వాయు కాలుష్యంతో ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారని, అలాగే ఈ విద్యుత్ కేంద్రాల చుట్టూ వందల కిలో మీటర్ల పరిధిలో శిశు మరణాలు కూడా అత్యధికంగా పెరిగాయని 2022 నాటి లాన్సెట్ పరిశోధనా పత్రం బయటపెట్టింది. ఇదే అంశంపై ఆస్ట్రేలియాకు చెందిన క్లైమెట్ ఎనర్జీ ఫైనాన్స్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ టిమ్ బక్లే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో విద్యుత్తు ఛార్జీలు పెరిగి భారత్‌లోని పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, నిరుడు హిండెన్‌బర్గ్ ఆరోపణలతో పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిన అదానీ గ్రూప్‌నకు.. తాజా ఆరోపణలు మరో మరకేనని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, తమ సంస్థపై వచ్చిన ఆరోపణలు, మీడియా నివేదికలను అదానీ గ్రూప్ ఖండించింది. లోడింగ్ మరియు డిశ్చార్జ్ సమయంలో బొగ్గు నాణ్యతను స్వతంత్రంగా పరీక్షించామని తెలిపింది. కస్టమ్స్ అధికారులు మరియు టాంగెడ్‌కో శాస్త్రవేత్తలు సైతం టెస్ట్ చేశారని వివరణ ఇచ్చింది. ఈ ఆరోణలు నిరాధారమని, పూర్తిగా అసంబద్ధమని తేల్చి చెప్పింది.
నిజానికి అదానీ గ్రూప్ బొగ్గు అక్రమాలు ఈనాటివేం కాదు. వీటిని ఎనిమిదేండ్లకిందటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్‌ఐ).. గుర్తించింది. ఇండోనేషియా నుంచి నాశిరకం బొగ్గును దిగుమతి చేసుకుంటూ, దేశంలో బొగ్గు కొరత ఉందనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారని, ఈ వ్యాపారం పేరుతో విదేశాలకు డబ్బును తరలిస్తున్నారంటూ అదానీసహా 40 మంది బొగ్గు దిగుమతిదారులకు 2016లో డీఆర్‌ఐ నోటీసులిచ్చింది. అసలు పోర్టుల్లో దిగుమతైన బొగ్గుకు చూపించిన ధరల్లో 50 శాతానికే కొంటున్నారని పేర్కొంది. ఈ బొగ్గుతో తయారైన విద్యుత్తును అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించింది. ఎక్కువ ధరకు విద్యుత్తును కొని ప్రజలు, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు నష్టపోతున్నాయని తేల్చిచెప్పింది. అయితే, డీఆర్‌ఐ దర్యాప్తును నిలిపేయాలంటూ బాంబే హైకోర్టు నుంచి అదానీ గ్రూప్ స్టే తెచ్చుకొన్నది. దీంతో డీఆర్‌ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం ఈ కేసు అటకెక్కింది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న నాటి నుంచే గౌతమ్ అదానీతో ఆయనకున్న స్నేహమే ఈ విచారణలన్నీ ఆగిపోవటానికి కారణమనే ఆరోపణ ఉన్నప్పటికీ దానిప వారెవరూ ఎప్పుడూ స్పందించింది లేదు.
Also Read:మండలి ఎన్నికల్లో సంప్రదాయం పాటిస్తున్నారా?
తాజాగా, అవినీతితో బాటు పర్యావరణానికి ప్రమాదం కలిగించే అంశాలున్న ఈ వ్యవహారం మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ కుంభకోణంపై దర్యాప్తు చేపడతామని, పార్లమెంటరీ సంయుక్త కమిటీచే విచారణ చేయించి, నిజాలు నిగ్గుతేల్చి, అవినీతి పరులు కాజేసిన సొమ్మును ఖజానాకు జమచేస్తామని ప్రకటించారు. ఇంత జరుగుతున్నా ఈడీ, సీబీఐ, ఐటీ వంటి వ్యవస్థలు మౌనంగా ఉండటం దేనికి సంకేతమని ఆయన నిలదీసినా సర్కారు వైపు నుంచి ఏ స్పందనా లేకపోవటం విచారకరం. ఏదిఏమైనా ఈ అంశం మీద మరోమారు విచారణ జరిపి, లూటీ అయిన ప్రజాధనాన్ని కక్కించాలనే డిమాంజ్ దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది.
-గోరంట్ల శివరామకృష్ణ (సీనియర్ జర్నలిస్ట్)