– ఓట్ల కోసం సెంటిమెంట్ రాజకీయాలు
– నాడు సర్జికల్ స్ట్రయిక్ అన్న బీజేపీ
– నేడు అయోధ్య రాముడి జపం
– కుమార్తె అరెస్ట్‌ను వాడేస్తున్న కేసీఆర్
– పదే పదే ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారం
– సానుభూతి ఓట్ల కోసం బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నాలు
Kcr Modi centiment politics speaches election campaigns: రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే తనకంటూ ఓ మార్క్ చూపించుకోగలగాలి. ఒక్కో నేతదీ ఒక్కో శైలి. జాతీయ రాజకీయ నేతల నుంచి ప్రాంతీయ నేతల దాకా జనంలో క్రేజ్ ఉంటేనే ఆ నాయకుడికి అతని పార్టీకి గుర్తింపు లభిస్తుంది. అయితే, ప్రస్తుత రాజకీయ నాయకులలో అటు కేంద్రంలో మోదీ, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ సెంటిమెంట్లు రగిలించడంలో దిట్టగా చెబుతుంటారు రాజకీయ పండితులు. పార్లమెంట్ ఎన్నికల వేళ పరిస్థితులను, గత ఎన్నికల సమయంలో జరిగిన సెంటిమెంట్ రాజకీయాలను గమనించిన వారు ఎవరైనా ఇదే చెప్తారని అంటున్నారు.
మోదీ గెలుపు సెంటిమెంట్
ప్రతి ఎన్నికలలో గెలుపు కోసం మోదీ ఏదో ఒకటి చేస్తుంటారు. గత ఎన్నికలలో సర్జికల్ స్ట్రయిక్ అంశాన్ని సెంటిమెంట్‌గా వాడుకుని లాభం పొందారు. ఈసారి ఏకంగా అయోధ్య రాముడిని సెంటిమెంట్ అస్త్రంగా వాడుకుంటున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా తనకి తానే ఓ అవతార పురుషుడిగా అభినవ శ్రీరాముడిగా చెప్పుకుంటున్నారని విపక్షాలు మాట్లాడుతున్నాయి. అయినా, ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందర నుంచే వరుసగా దేశం మొత్తం తీర్థయాత్రలు మొదలుపెట్టారు మోదీ. యావత్ హిందూ ప్రతినిధిగా ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ, ఉపన్యాసంలోనూ హిందూ దేవుళ్ల ప్రస్తావన ఉండక మానదు. హిందూ ఓట్ల కోసం అవసరమైతే ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. అప్పుడప్పుడు మనది లౌకిక రాజ్యం అనే సంగతి కూడా మర్చిపోయి అనర్గళంగా ఉపన్యాసాలిస్తుంటారనే విమర్శలున్నాయి.
కేసీఆర్ ప్రాంతీయ సెంటిమెంట్
ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంగతికొస్తే సెంటిమెంట్‌ను ఆయుధంగా వాడుకోవడంలో మోదీని మించిపోయారని అంతా అంటారు. ఎందుకంటే పదేళ్ల క్రితం కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను జనాల్లో రగిల్చి మన ప్రాంతం, మన భాష, మన యాస అంటూ, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల ముందు తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్రోళ్లు కూడా మనోళ్లే అన్న కేసీఆర్ తీరా ఎన్నికల సమయంలో వాళ్లంతా సెటిలర్స్ అంటూ సెంటిమెంట్ అస్త్రాలు సంధించారు. ఇటీవల భువనగిరి ప్రచార సభలో పాల్గొన్న ఆయన తన బిడ్డను అన్యాయంగా జైలుకు పంపారంటూ కూతురు జైలు ఎపిసోడ్‌ను కూడా సెంటిమెంట్‌గా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
కవిత జైలు సెంటిమెంట్
పదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ‘తెలంగాణ బాపు’గా కొంతకాలం పాటు పిలిపించుకున్న మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్, కుమార్తె కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకుపోతారని ఆనాడు ఎవరైనా ఊహించారా? కవిత అరెస్టు న్యాయమా, అన్యాయమా? అన్న విషయం పక్కన పెడితే ఈ దుస్థితికి ఆమె స్వయంకృతాపరాధమే కారణం అంటున్నారు రాజకీయ పండితులు. పదేళ్లపాటు తండ్రి కేసీఆర్ ఏకఛత్రాధిపత్యంగా పాలించిన తెలంగాణ రాష్ట్రంలో సంపాదించుకోవడానికి అవకాశాలే లేనట్టుగా, సంపాదించుకున్నది చాలదు అన్నట్టుగా ఆమె ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలోకి కూడా చొరబడ్డారని విపక్షాలు మండిపడుతున్నాయి. కవిత అరెస్టు అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికం అని ఇంతకాలం గమ్మున ఉన్న కేసీఆర్ తీరా పార్లమెంట్ ఎన్నికలలో గగ్గోలు పెట్టడం గురివింద సామెతను గుర్తుకుతెస్తున్నదని విపక్షాలు అంటున్నాయి.
బెడిసికొట్టిన ప్లాన్స్
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నీ నీళ్ల పంచాయితీని కూడా సెంటిమెంట్ ఓట్ల కోసం వాడుకున్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైన ఆయన మళ్లీ పార్లమెంట్ ఎన్నికలలో గెలుపు కోసం కృష్ణా జలాల సెంటిమెంట్, రైతు దీక్షలు లాంటి సెంటిమెంట్లను రగిలించే ప్రయత్నం చేశారు. కాకపోతే, అవి వర్కవుట్ కాకపోవడంతో ఇప్పుడు కూతురు జైలు వ్యవహారాన్ని సానుభూతి ఓట్ల కోసం వాడుకుంటున్నారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.