BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిన్న అరెస్టు చేసింది. ఈ అరెస్టును సవాల్ చేస్తూ కవిత తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాగే.. కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. న్యాయమూర్తి కావేరీ బవేజా వాదనలు వింటున్నారు. సీబీఐ కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషనర్ పై తీర్పు రిజర్వ్ చేశారు. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువరించనున్నారు. కవిత పిటిషన్ పై వాదనలు వినే అవకాశం ఉన్నది.
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈ రోజు ఉదయం పది గంటలకు వాదనలు ప్రారంభం అయ్యాయి. సీబీఐ వాదనలు వినిపిస్తూ కవితపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఈ మొత్తం ఎపిసోడ్‌లో కవిత కీలకపాత్రధారి, సూత్రధారి. విజయ్ నాయర్, తదితరులతో కలిసి స్కెచ్ వేశారు. ఆమె ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలంతో ఈ కేసులో కవిత పాత్ర స్పష్టమవుతుంది. రూ. 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు అందించడంలో ఆమె కీలకంగా వ్యవహరించినట్టు ఈ స్టేట్‌మెంట్‌లో బయటపడింది. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రెండు దఫాలుగా రూ. 25 కోట్లు (రూ. 15 కోట్లు, రూ. 10 కోట్లు) అందించారు. ఈ విషయాన్ని ఆయన తన స్టేట్‌మెంట్‌లో తెలిపారు. వాట్సాప్ చాట్ కూడా ఈ విషయాలను కన్ఫామ్ చేస్తున్నాయి. ఈ ఆధారాలను కోర్టుకు సమర్పించాం’ అని సీబీఐ పేర్కొంది.
Also Read: ధాన్యం కొనుగోళ్లపై సీఎం స్పెషల్ ఫోకస్.. నేడు సమీక్ష
‘అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు పెద్ద మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్టు కవిత పీఏ అశోక్ కౌశిక్ తన వాంగ్మూలంలో అంగీకరించారు. బుచ్చిబాబు స్టేట్‌మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్స్‌లో 33 శాతం వాటా ఉన్నది. వీటికి సంబంధించిన ఆధారాలు ఇది వరకే చార్జిషీటల్లో పొందుపరిచాం. శరత్ చంద్రారెడ్డికి కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా జోన్‌కు రూ. 5 కోట్లు చొప్పున రూ. 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. కానీ, శరత్ చంద్రారెడ్డి తిరస్కరించడంతో కవిత బెదిరించారు. హైదరాబాద్‌లో ఆయన ఏ వ్యాపారమూ సాగనివ్వనని హెచ్చరించారు’ అని సీబీఐ వాదనలు వినిపించింది.
ఈ కేసులో కవితను తొలుత విట్నెస్‌గా చూశామని, కానీ, దర్యాప్తులో సేకరించిన ఆధారాలను దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ పాలసీలో కీలక కుట్రదారుల్లో ఆమె ఒకరని తేలిందని సీబీఐ పేర్కొంది. ఆది నుంచి కవిత విచారణకు అనవసర కారణాలు చూపుతూ దాటవేస్తూ వచ్చారని, అందువల్ల విచారించలేకపోయామని తెలిపింది. ఆమెను తిహార్ జైలులో ప్రశ్నించినా సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని, సీబీఐ స్వాధీనం చేసుకున్న పత్రాలకు విరుద్ధంగా ఆమె సమాధానాలు చెబుతున్నారని వివరించింది. కవిత ఆమెకు తెలిసిన వాస్తవాలను దాచి పెడుతున్నారని, మద్యం పాలసీకి సంబంధించిన పెద్ద కుట్రను వెలికితీయడానికి కవితను సాక్ష్యాలతో విచారించాల్సి ఉన్నదని తెలిపింది. ఈ కేసులో ఆమె కుట్రదారుగతా ఉన్నారని, తిహార్ జైలులో విచారిస్తే సహకరించలేదని, కాబట్టి, తమకు ఐదు రోజుల కస్టడీ కావాలని కోర్టును విజ్ఞప్తి చేసింది.
Also Read: రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఫోన్ ట్యాపింగ్? 25 మంది టీంతో నిఘా
కవిత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్ట్ చేయరాదని, కానీ, కవిత ఈ నిబంధన అనుసరించలేదని పేర్కొన్నారు.