CBI arrested MLC kavitha(Political news telugu): ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఇదే కేసులో ఈ నెల 6న తీహార్ జైల్లో కవితను విచారించిన సీబీఐ తాజాగా ఆమెను అదుపులోకి తీసుకుంది. రేపు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను సీబీఐ హాజరు పరచనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితను గత నెల అరెస్టు చేసింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆమెను తాజాగా సీబీఐ అరెస్టు చేసింది.
ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా ఎమ్మెల్సీ కవిత నివాసంలో సోదాలు చేసి మార్చి 15వ తేదీన అరెస్టు చేసి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆమెను ఈడీ అధికారులు విచారించారు. ఈ నెల 23వ తేదీ వరకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో కవితను అధికారులు తిహార్ జైలుకు తీసుకెళ్లారు. ఇంతలోనే సీబీఐ ఆమెను విచారించాలని అనుకుంది. రౌస్ అవెన్యూ కోర్టుకు శుక్రవారం విజ్ఞప్తి చేసింది. కవితను విచారించడానికి వెంటనే కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు అనుమతించగానే కవిత పిటిషన్ వేశారు. తనను విచారించడానికి సీబీఐకి అనుమతించే నిర్ణయాన్ని పున:పరిశీలించాలని విజ్ఙప్తి చేశారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరగా.. సీబీఐని స్పందించాల్సిందిగా కోర్టు తెలిపింది. ఇందుకు సమయం కావాలని సీబీఐ గడువు కోరింది. ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఇచ్చింది. 10వ తేదీన వాదనలు విన్న తర్వాతే కవిత పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.
Also Read: కవిత పిటిషన్‌కు సమాధానం అక్కర్లేదు.. ‘ఆల్రెడీ విచారించాం’
ఇదిలా ఉండగా, కోర్టు అనుమతి తీసుకున్న మరుసటి రోజే సీబీఐ తిహార్ జైలులో కవితను ప్రశ్నించింది. ఆర్డర్ రావడానికి ముందే సీబీఐ ప్రశ్నించిందని వాదించగా.. భవిష్యత్‌లో ముందస్తుగా సమాచారం ఇవ్వాలని న్యాయమూర్తి కావేరీ బవేజా సీబీఐకి సూచించింది. అయినప్పటికీ.. కవితకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా విచారించిన అంశంపై తాము వాదనలు వినిపిస్తామని కవిత తరఫు న్యాయవాదులు వాదించారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
ఇంతలోనే సీబీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కవితను సీబీఐ అరెస్టు చేసింది. ఈ మేరకు ప్రకటించింది. రేపు కోర్టు ముందు హాజరు పరిచి కస్టడీ అడిగే చాన్స్ ఉన్నది. ఇప్పటికే ఈడీ కేసులోనే ఆమెకు రెగ్యులర్ బెయిల్ కోసం విచారణలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎటూ తేలలేదు. ఇంతలోనే సీబీఐ అరెస్టు చేసింది. ఒక వేళ కవిత బయటికి రావాలంటే ఇప్పుడు ఈ రెండు కేసులలో బెయిల్ పొందాల్సి ఉంటుంది. దీంతో కవిత ఇప్పటిల్లో బయటికి రావకపోవచ్చని తెలుస్తున్నది. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికలకు ముందు ఆమె విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు.