Navneet Kaur Rana: మహారాష్ట్రలో బీజేపీ ఎంపీ అభ్యర్థి, ఒకప్పటి టాలీవుడ్ నటి నవనీత్ కౌర్‌కు షాక్ తగిలింది. రెండు రోజుల తెలంగాణ పర్యటన సందర్భంగా ఆమె పాతబస్తీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 15 సెకండ్ల సమయం ఇస్తే.. అంటూ ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. దశాబ్ద కాలం క్రితం ఎంఐఎం లీడర్ అక్బురుద్దీన్ ఒవైసీ చేసిన మాటలకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆందోళనలు వెలువడ్డాయి. వెంటనే ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారు. షాద్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నవనీత్ కౌర్ పై కేసు నమోదు చేశారు.
షాద్‌నగర్‌లో నవనీత్ కౌర్ రాణా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే పాకిస్తాన్‌కు వేసినట్టేనని అన్నారు. అదే విధంగా హైదరాబాద్ ఎంపీ సీటు గెలుచుకునే లక్ష్యంతో చేస్తున్న ప్రచారంలో ఆమె మజ్లిస్ పార్టీని టార్గెట్ చేశారు. పోలీసులు ఒక 15 నిమిషాలు తమకు సమయం ఇస్తే ఎవరూ మిగలరని గతంలో అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు గాను ఆయనపై కేసు కూడా నమోదైంది. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలకు నవనీత్ కౌర్ రాణా కౌంటర్ ఇచ్చారు. వారికి.. ఆ చోటె బాయ్‌కి 15 నిమిషాల సమయం అవసరమేమో కానీ, తమకు 15 సెకండ్ల సమయం చాలు అని పేర్కొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో.. ఎక్కడి నుంచి వెళ్లారో కూడా తెలియకుండా జరిగిపోతుందని అన్నారు.
Also Read: వివేకా హత్య కేసులో భారతి రెడ్డి పాత్ర? బిగ్ టీవీతో వైఎస్ షర్మిల ఇంటర్వ్యూ
ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. 15 సెకండ్లు కాదు.. 15 గంటలు తీసుకోవాలని, తమను ఏం చేస్తారో చేసుకోవాలని అన్నారు. మీరేం చేస్తారో చూస్తాం.. మీలో ఇంకా ఎంత మానవత్వం ఉన్నదో చూపించండి అని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కూడా నవనీత్ కౌర్ రాణా చేసిన విద్వేష వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలతో మతపరమైన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిపై యాక్షన్ తీసుకోవాలని కోరారు. ఆమె పై కేసు నమోదు చేయాలని ఎన్నికల సంఘం అధికారులనూ కోరారు.
నవనీత్ కౌర్ రాణా చేసిన విద్వేష వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సీరియస్‌గా పరిగణించింది. షాద్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. పోలీసులు బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రాణాపై కేసు నమోదు చేశారు.