– ప్రచారంలో అభ్యర్థుల జోరు
– పేలుతున్న పంచ్‌లు
– ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న నేతలు
– ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం
MLC Elections: పార్లమెంట్ ఎన్నికల యుద్ధం ముగియగానే, ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వార్ మొదలైంది. ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాను ప్రశ్నించే గొంతుక అని, గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. తాను ప్రశ్నిస్తున్నాననే కేసీఆర్ కేసులు పెట్టించారని, ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా పోరాటం చేశానని చెప్పారు. తాను ఎప్పటి నుంచో ప్రజల పక్షాన పోరాడుతున్నానని, ప్రజలంతా ఏకం కావడంతో ఒక నియంతను గద్దె దించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. జీవో 317తో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని, వాటిని సరిచేసి తీరుతామని హామీ ఇచ్చారు. కేటీఆర్ తనను ఓడించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, అవేవీ వర్కవుట్ కావని సెటైర్లు వేశారు. జీవో 46తో నిరుద్యోగుల చావులకు కారణమైన బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు మల్లన్న. ప్రతీ నెలా సక్రమంగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు.
అధికారంలో ఉండి.. ఎలా ప్రశ్నిస్తారు?
పట్టభద్రులు ఎన్నిక అనేది చాలా ముఖ్యమన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి. చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారని చెప్పారు. రెండు సార్లు కేసీఆర్‌కు అవకాశం ఇచ్చిన ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలి అంటే ప్రశ్నించే వ్యక్తిని చట్ట సభల్లో ఉంచాలని సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రశ్నించే గొంతుక అని అంటున్నారని, ఆయన ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని సెటైర్లు వేశారు. ఇప్పటిదాకా నిరుద్యోగ భృతి విషయంలో, ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్‌పై ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. మెగా డీఎస్పీ అమలు కావాలంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు రాకేష్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్ధిగా తాను ప్రశ్నించే గొంతుకను అవుతానని, ప్రజా సమస్యల కోసం పోరాడతానని స్పష్టం చేశారు. దందా కోసం, డబ్బు కోసం, వ్యూస్ కోసం కాదని, 5వ సారి గులాబీ జెండాను ఈ గడ్డ మీద ఎగురవేయాలని కోరారు. ఈనెల 27న జరిగే ఎన్నికలో తనను గెలిపించాలని, 3వ నెంబర్‌పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రాకేష్ రెడ్డి.
ఒకే ఒక్క ఛాన్స్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓ అవకాశం ఇవ్వాలని కోరారు ఆపార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. ఖమ్మంలో మాట్లాడిన ఆయన, గ్యారెంటీ అంటే మోదీ, మోదీ అంటే గ్యారెంటీ అని చెప్పారు. అటువంటి పార్టీ నుండి వచ్చిన తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని కోరారు. 2014 కంటే ముందు దేశంలో మెడికల్ కళాశాలలు ఎన్ని ఉండేవి, ఎయిర్‌పోర్టులు ఎన్ని ఉండేవి, రైల్వే స్టేషన్లు ఎన్ని ఉండేవి, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అనేది గమనించాలన్నారు. దేశం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందంటే ప్రధాని మోదీ కృషి ఎనలేనిదని చెప్పారు. ఆయన మరోసారి ప్రధాని అవుతారని దేశం మొత్తం చెప్తోందని, 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేస్తోందని, జాబ్ క్యాలెండర్ వేస్తా అని వేయలేదని విమర్శించారు. అలాగే, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని విస్మరించిందని మండిపడ్డారు. ఆ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని సెటైర్లు వేశారు. మరోవైపు, హనుమకొండ బీజేపీ కార్యాలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం బీజేపీ పోరాటం చేసిందని గుర్తు చేశారు. విద్యావంతులు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. పట్టభద్రుల ఓట్లతోనే దానికి నాంది పలకాలని కోరారు.