BRS Party: జంపింగ్ జపాంగ్‌లను బీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంటున్నది. ఇతర నాయకులను పక్కనపెట్టి వారికి టికెట్లు ఇస్తే గెలిచిన వారు.. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉండగా మరో పార్టీలోకి జంప్ కావడంతో గులాబీ పార్టీ రివేంజ్ మోడ్‌లోకి వెళ్లుతున్నది. పార్టీ మారిన నాయకులను వెంటాడుతామని స్పష్టం చేస్తున్నది. వారి పదవులను ఊస్ట్ చేసే వరకు విడిచిపెట్టబోమని ప్రతినపూనింది. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈ మేరకు పార్టీ వైఖరిని వెల్లడించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. పార్టీ మారిన వారిని వదిలిపెట్టబోమని, వారి పోస్టు ఊస్ట్ చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఒక పార్టీ టికెట్ పై గెలిచి మరో పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పుడు వెంటనే అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. కాబట్టి, తప్పకుండా వీరి పదవులు ఊడటం ఖాయం అని, ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం పక్కా అని చెప్పారు. వారిద్దరిపై యాక్షన్ తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు గత నెల 18న విజ్ఞప్తి చేశామని, ఇటీవలే అసెంబ్లీ సెక్రెటరీ వద్దకు వెళ్లామని, జాయింట్ సెక్రెటరీకి ఫిర్యాదు అందించామని కేటీఆర్ చెప్పారు. ఒక వేళ ఇక్కడ పని జరగకుంటే హైకోర్టుకు వెళ్లుతామని, అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లుతామని స్పష్టం చేశారు.
నా ఫోన్ కూడా ట్యాప్:
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు కాకరేపుతున్న తరుణంలో కేటీఆర్ తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని పేర్కొన్నారు. 2022, 23 కాలంలో తన యాపిల్ ఫోన్‌కు మెస్సేజీ వచ్చిందని, తన ఫోన్ నిఘాలో ఉన్నదని, హ్యాక్ అయిందనీ పేర్కొంటూ ఓ మెస్సేజీ వచ్చిందని వెల్లడించారు. అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురికి ఈ మెస్సేజీలు వచ్చాయని వివరించారు. కేటీఆర్ చెప్పిన కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్న సంగతి తెలిసిందే. తనకు ఎలాంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం లేదని, ఫోన్ ట్యాపింగ్‌తోనూ తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
అప్పటి నుంచి దర్యాప్తు చేయండి:
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కొత్త కావని, తమ ప్రభుత్వానికి ముందు 2004 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని కేటీఆర్ గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులే పొన్నం ప్రభాకర్, గడ్డం వినోద్ వంటి వారు తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలు చేశారు. కాబట్టి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలనుకుంటే దాని పరిధిని విస్తరించండని, 2004 నుంచి ఈ కోణంలో దర్యాప్తు జరపండని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న అధికారులే.. ఇప్పుడు వివిధ హోదాల్లో ఉన్న అధికారులే.. అప్పుడూ ఉన్నారని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అదీ కేసీఆర్‌కు మాత్రమే తెలుసు అన్నట్టుగా ఎందుకు ప్రచారం చేయడం? ఒక వేళ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే ఈ అధికారులు ఎవరికీ తెలియదా? అంటూ ఎదురు ప్రశ్నించారు.