Jammu Kashmir: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యూపీలోని హత్రాస్ నుంచి జమ్ము కశ్మీర్‌లోని రియాసి జిల్లాలకు భక్తులతో వెళ్తున్న బస్సు గురువారం మధ్యాహ్నం 150 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. రియాసిలోని శివ ఖోరి పుణ్యక్షేత్రానికి వెళ్లాల్సిన ఆ బస్సు జమ్ములోని అఖ్నూర్ ఏరియాలోని లోతైన లోయలోకి జారిపోయింది. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే 21 మంది మరణించినట్టు వైద్యులు తెలిపారు. 40 మంది గాయపడినట్టు వివరించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. అయితే, ఎంత మంది మరణించారన్నదే ఇప్పుడే చెప్పలేమని వైద్యులు, అధికారవర్గాలు వివరించాయి.
తొలుత క్షతగాత్రులను అఖ్నూర్‌లోని సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తరలించారు. తీవ్రంగా గాయలైనవారిని అక్కడి నుంచి జమ్ములోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. పలువురు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని ఉన్నత అధికారవర్గాలు తెలిపాయి. ఘటన జరగ్గానే పోలీసులు, ఉన్నతాధికారులు వెంటనే స్పాట్‌కు చేరుకుని అక్కడి పరిస్థితులను, రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించారు.
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన రాష్ట్రపతి క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటన కలవరపరిచినట్టు పేర్కొన్న ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, గాయపడ్డవారికి రూ. 50 వేల తక్షణ సాయం ప్రకటించారు. మృతులకు సంతాపం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. బాధిత కుటుంబాలకు అన్ని రకాల సహాయం అందిస్తామని, గాయపడ్డవారికి వైద్య సహకారం అందిస్తామని వివరించారు.