Building Pride Indias Heritage: నా చిన్నతనంలో ఉదయం పూట బడిలో ‘భారతదేశం నా మాతృభూమి.. సుసంపన్నమైన, బహు విధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి నేను సర్వదా కృషి చేస్తాను ’అంటూ ప్రతిజ్ఞ చేసేవాళ్లం. మన రాజ్యాంగం కూడా వారసత్వ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యతగా ఆదేశిక సూత్రాలలో నిర్దేశించింది. అందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1984 నుండి ‘భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ’, ‘రాష్ట్ర పురావస్తు శాఖ’లు ఏటా ‘హెరిటేజ్ వీక్’ పేరిట వారసత్వ సంపద విలువ, వాటి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. భౌగోళికంగా,సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయ పరంగా మనది వైవిధ్య భరితమైన సంస్కృతే అయినప్పటికీ మనందరికీ ఉమ్మడిగా ఒక ఘనమైన, గర్వించదగిన గొప్ప వారసత్వ చరిత్ర ఉందనే ఎరుకను అటు స్వచ్ఛంద సంస్థలూ కల్పించటం ముదావహం.
అటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ కట్టడాలను గుర్తించి, వాటికి అంతర్జాతీయ గుర్తింపునిచ్చేందుకు యూనెస్కో ఆధ్వర్యంలో 1945లో ‘వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్’ 1945లో ఏర్పడింది. వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలనే సృహను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌరుల్లో కలిగించేందుకు ఐక్యరాజ్యసమితి 1972లో ప్రపంచ సాంస్కృతిక, పకృతి పరిరక్షణకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తర్వాత అంతర్జాతీయ వారసత్వ కట్టడాలు, స్థలాలు పరిరక్షణ సంస్థ 1982 ఏప్రిల్ 18న ఆఫ్రికాలోని ట్యునీషియాలో ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించి ఐక్యరాజ్యసమితిలోని అన్ని సభ్య దేశాలూ ఏప్రిల్ 18న ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’ పేరుతో తమ తమ ప్రాంతాల్లోని చారిత్రక, వారసత్వ కట్టడాలను పరిరక్షించేందుకు ముందుడుగు వేయాలని తీర్మానించింది. నాటి నుంచి ఏటా ఒక్కో థీమ్‌తో ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవంగా అన్ని దేశాలూ జరుపుకుంటున్నాయి. 2024 సంవత్సరానికి ‘ఆవిష్కరిద్దాం.. వైవిధ్యాన్ని ఆస్వాదిద్దాం’అనే థీమ్‌ను ప్రకటించారు.
Also Read: దోపిడీదారులకు ఓటుతో బుద్ధి చెబుదాం..
అనేక శిల్పకళారీతులకు, ఆలయాలకు, రాజ ప్రాసాదాలకు, ఊహకు అందని నిర్మాణ వైభవాన్ని కల్గిన అనేక నిర్మాణాలకు మనదేశం నిలయం. అయితే విదేశీయుల దండయాత్రల మూలంగా ఇందులో కొంత భాగం ధ్వంసం కాగా, మరికొంత నాటి వలస పాలకుల చేత, ఆ తర్వాతి రోజుల్లో కొందరు అక్రమార్కుల కారణంగా దేశం దాటిపోయింది. వారసత్వ పరిరక్షణ కోసం నాటి ప్రధాని ఇందిరా గాంధీ, సంస్కృతి సాంప్రదాయాలు, కళలు, సాహిత్యం, కట్టడాల సంరక్షణ కోసం రాజీవ్ గాంధీ ఛైర్మన్‌గా ‘భారత జాతీయ కళా సాంస్కృతిక సంస్థ’ నెలకొల్పారు. ఈ క్రమంలో కొంత కృషి జరిగింది. అలా మొదలైన కృషి తర్వాతి రోజుల్లోనూ ఆయా ప్రభుత్వాల చొరవతో కొనసాగుతూ వచ్చింది. దీని మూలంగా నాడు మొదలైన ఈ ప్రయత్నంలో భాగంగా నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1154 వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్, సైట్స్ విశిష్ట గుర్తింపును పొందాయి. వీటిలో 897 కల్చరల్, 218 నేచురల్, 39 మిక్సింగ్ విభాగాలకు చెందినవి. వీటిలో ఎక్కువగా ఐరోపా, ఉత్తర అమెరికాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో 58 ప్రపంచ స్థాయి వారసత్వ కట్టడాలతో ఇటలీ మొదటి స్థానంలో ఉండగా, చైనా (56), జర్మనీ (51), ఫ్రాన్స్ (48), స్వీడన్ (49), భారత్ (40) తర్వాతి స్థానాలను ఆక్రమించాయి.
2021లో ప్రకటించబడిన వారసత్వ కట్టడాల జాబితాలో తెలంగాణలోని రామప్ప దేవాలయం, గుజరాత్‌లోని ‘ధోలవీర’ స్థానం సంపాదించాయి. వీటిలో 32 కల్చరల్, 7 ప్రకృతి, 1 మిశ్రమ విభాగాలకు చెందినవి. మనదేశంలో 19 రాష్ట్రాల్లో ఈ వారసత్వ కట్టడాలున్నాయి. ఈ జాబితాలో 5 వారసత్వ కట్టడాలతో మహారాష్ట్ర ప్రధమ స్థానంలో ఉంది. అజంతా ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్ మహల్, కోణార్క్ సూర్య దేవాలయం, ఖజురహో, కజిరంగా నేషనల్ పార్క్, ఫతేపూర్ సిక్కీం, కుతుబ్‌మినార్, తమిళ,కన్నడ ఆలయాలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అనంతపురంలోని లేపాక్షి దేవాలయం అసమానమైన సాంస్కృతిక, నిర్మాణ మరియు వారసత్వ విలువలను కలిగి ఉంది. 16వ శతాబ్దం ప్రారంభంలో విజయనగర పాలకులచే నిర్మించబడిన ఈ ఆలయం వేలాడే స్తంభం మరియు రాతి గొలుసుకు ప్రసిద్ధి చెందింది. ఇందులో అనేక కుడ్య చిత్రాలు మరియు తెలుగు శాసనాలు ఉన్నాయి. గ్రానైట్ రాయితో చెక్కిన ప్రపంచంలోనే అతిపెద్ద నంది దీనితో ముడిపడి ఉంది. లేపాక్షి రామాయణంతో ముడిపడి ఉంది. కడప జిల్లాలోని వొంటిమిట్టలో ఉన్న ఆలయం మూడు గోపురాలతో గంభీరమైన నిర్మాణం. ఇది రాతితో చెక్కబడిన 32 స్తంభాలతో కూడిన బహిరంగ ఆడిటోరియం లేదా మండపం కలిగి ఉంది. విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం తెలుగులో మహా భాగవతం రాసిన బొమ్మెర పోతనతో సహా అనేక మంది కవులను ఆకర్షించింది. వీటితో బాటు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖ లింగం, శాలిహుండం బౌద్ధ ప్రదేశం, అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట ఆలయం, గుర్రంకొండ కోట, కూచిపూడి, ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టు తిమ్మమ్మ మర్రిమాను, అరకు లోయ, బొర్రా గుహలు, తెలంగాణలోని చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధులు, ఆలంపూర్ ఆలయాలు, మెదక్ చర్చి వంటివి వారసత్వ హోదా పొందేందుకు అన్ని అర్హతలున్నవిగా గుర్తింపు పొందాయి.
Also Read: విప్లవ స్వాప్నికుడు, పీపుల్స్ వార్ గ్రూప్ వ్యవస్థాపకుడు కె.ఎస్..
తెలుగు రాష్ట్రాలలో 1960 నుంచి పురావస్తు స్థలాలు, కట్టడాల పరిరక్షణ చట్టం అమలు అవుతోంది. వారసత్వ సంపద కాపాడుటకు దేవాదాయ ధర్మాదాయ శాఖ, పురావస్తు శాఖ, పలు నిఘా సంస్థలు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. కొత్త వాటిని నిర్మించడం పైనే పాలకులు, వివిధ సంస్థలు దృష్టి కేంద్రీకరణ చేస్తున్నాయి తప్ప, శిథిలావస్థకు చేరుకుంటున్న కట్టడాలు, నిర్మాణాలు పరిరక్షణకు తగిన నిధులు మంజూరు చేయడం లేదు. భద్రతా చర్యలు అనుకున్న రీతిలో ఉండటం లేదు. తీరా ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటిస్తున్నా, ఆయా ప్రభుత్వాలు చొరవ చూపకపోతే, వారసత్వ హోదా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఆధునీకరణ, మరమ్మతులు చేసే క్రమంలో సున్నం రాయడం ద్వారా అసలు విగ్రహం ప్రతిష్టత, నైపుణ్యాలు, శాసనాలు నాణ్యత కోల్పోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ వారసత్వ ప్రదేశాలు సంపదలు కాపాడుకొనేందుకు ప్రభుత్వాలు, ప్రజలు చొరవ తీసుకోవాలి. కాలుష్య కోరల్లో ఉన్న ‘తాజ్ మహల్’తో సహా ప్రతి వారసత్వ సంపదనూ కాపాడి రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిదీ. ‘వారసత్వ సంపదలే…మన జవసత్వాలు’ అనే నిజాన్ని జనంలోకి తీసుకుపోగలిగితే మన పూర్వీకుల గొప్పతనం, నైపుణ్యాలు నేటి తరం అవగాహన చేసుకోగలుగుతుంది. వివిధ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, ఇంజనీరింగ్ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఈఫిల్ టవర్, చైనా గోడ, స్టాట్యు ఆఫ్ లిబర్టీ, తాజ్ మహల్, రామప్ప గుడి వంటివి ఉదాహరణలుగా నిలిచాయి. ముఖ్యంగా పర్యాటకులు, సందర్శకులు ఆకర్షించే విధంగా వారసత్వ ప్రదేశాలు రూపుదిద్దుకోవాలి. దానికి ప్రభుత్వాలు పూనుకొని పటిష్ట ప్రణాళికలు రచించి అమలు చేయాలి. ఆదాయ ఆర్జనతో పాటు, వారసత్వ సంపద పరిరక్షణకు ప్రధమ ప్రాధాన్యతనివ్వటమే ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవపు అసలు పరమార్థం.
– నెక్కంటి అంత్రివేది (సామాజిక కార్యకర్త)