– ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు
– పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మాయం
– కాళేశ్వరంలో జరిగిన తప్పులకు కేసీఆర్ సారీ చెప్పాల్సిందే
– దేశాన్ని బీజేపీ విచ్ఛిన్నం చేయాలనుకుంటోంది
– మోదీ వ్యాఖ్యలు అందులోనే భాగమన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
– బీజేపీని మళ్లీ గెలిపించొద్దని ప్రజలకు సూచన
BRS: మరోసారి బీజేపీ గెలిస్తే డెమోక్రసీకి ప్రమాదమని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టులకు వెల్ఫేర్, ఇళ్ల స్థలాలు, సెక్యూరిటీ కల్పించే బాధ్యత తమదని స్పష్టం చేశారు.’
పార్లమెంట్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందన్న ఆయన, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి పార్లమెంట్‌లో ఎక్కువ మంది ఎంపీలని సస్పెండ్ చేసింది బీజేపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. బిల్లుల మీద కనీసం చర్చ కూడా చేయలేని విమర్శించారు. మరొక సారి మోదీ ప్రధాని అయితే పాకిస్తాన్, రష్యా, నార్త్ కొరియా లాగా భారత్ తయారవుతుందన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ కేసులతో ప్రతిపక్ష పార్టీల నేతలను వేధిస్తున్నారని, బీజేపీ మరోసారి అధికారం చేపడితే పార్లమెంటరీ డెమోక్రసీకి ప్రమాదని చెప్పారు.
Also Read: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు బెయిల్
మోదీ ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదన్న ఉత్తమ్, ఎంఎస్పీకి చట్టబద్దత కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ స్కీం కింద ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని, అగ్నివీర్ పథకం దేశ రక్షణకు మంచిది కాదని హితవు పలికారు. ప్రధాన మంత్రిగా మోదీ దిగజారి మాట్లాడుతున్నారని, దేశాన్ని ఎలా విభజించాలనేదే ఆయన ఆలోచనగా కనిపిస్తోందని విమర్శలు చేశారు. బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్న ఆయన, ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రైవేట్ దళారీలకు అమ్ముకుంటోందని విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఉండదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ త్వరలోనే వీఆర్ఎస్ తీసుకుంటుందని విమర్శించారు. కేసీఆర్, ఇరిగేషన్ వ్యవస్థను సర్వనాశనం చేశారని, కాళేశ్వరం విషయంలో జరిగిన తప్పులకు ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.